మేం అంటరాని వాళ్లమా... : ఎంఐఎం బాధ విన్నారా?
తెలంగాణకు చెందిన మజ్లిస్ పార్టీ ఎంఐఎం
తెలంగాణకు చెందిన మజ్లిస్ పార్టీ ఎంఐఎం.. ఇప్పుడు తెగ బాధ పడుతోంది. మేం అంటరాని వాళ్లమా? అని దేశ రాజకీయ పార్టీలను నిలదీస్తోంది. అంతేకాదు.. మాతో అవసరం ఉన్నప్పుడు చేతులు కలిపిన వారు .. ఇప్పుడు మమ్మల్ని కనీసం పట్టించుకోరా? అని కూడా నిలదీస్తోంది. కీలకమైన ఎన్నికల సమ యంలో ఈ దేశంలో మా పార్టీ అంటూ.. ఒకటి ఉంది అని కూడా గుర్తించలేరా? అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఇటు విపక్షాలు, అటు అధికార పక్షాలపైనా నిప్పులు చెరుగుతోంది.
మరి దీనికి కారణం.. తాజాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇది అధికారిక కార్యక్రమమే. ఈ సమావేశం ద్వారా సభలో ఎలాంటి ఘర్షణలు వద్దని.. అందరూ కలివిడిగా సభలు సాగేలా ప్రయత్నించాలని చేసే ప్రయత్నం. ఓకే ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పక్షాలను పిలిచిన కేంద్ర ప్రభుత్వం ఎంఐఎం పార్టీని మాత్రం విస్మరించింది.
కనీసం చూచాయగా కూడా సమాచారం ఇవ్వలేదు. ఎంఐఎంకు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వం వహిస్తు న్నారు. ఈయన హైదరాబాద్‌కు ఎంపీగా కూడా ఉన్నారు. మరి అలాంటిది తమకు ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదు.. అనేది ఆయన ప్రశ్న.
ఇక, మరోవైపు.. మోడీపై యుద్ధం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సహా 26 పార్టీల నాయకులు కూడా ఎంఐఎంను పట్టించుకోలేదు. వాస్తవానికి కొన్నాళ్లుగా కేంద్రంపై ఎంఐఎం కూడా పోరాటం చేస్తోంది. మరి ఇలాంటి సమయంలో తమను పట్టించుకోలేదే? అని ఇటు వీళ్లను కూడా ప్రశ్నించడం గమనార్హం.
మొత్తంగా చూస్తే.. ఇప్పుడు ఎంఐఎం పరిస్థితి ఆ పార్టీ నేతలు అన్నట్టుగానే అంటరాని వాళ్లగా మారిపో యిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆ పార్టీ చేసుకున్నదేనని కొందరు చెబుతున్నా రు. యూపీ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బీ టీంగా పనిచేసిందనే వాదన బలంగా అప్పట్లో వినిపించింది.
ఈ పరిణామంతో ఎంఐఎం విశ్వాసం కోల్పోయిందనే మాట తరచుగా పార్టీల మధ్య వచ్చింది. దీంతోనే ఇప్పుడు అటు బీజేపీ, ఇటు ఇతర పక్షాలు కూడా ఎంఐఎంను పక్కన పెట్టేశాయని అంటున్నారు పరిశీలకులు.