తెలంగాణ రైతుని కోటీశ్వరుడిని చేసిన టమాటా... కేసీఆర్ హ్యాపీ!
మహిపాల్ రెడ్డి విషయంలో అదేజరిగిందని అంటున్నారు
ప్రస్తుతం దేశవ్యాప్తంగ టమాటా ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి టమాటా ధరలు చూస్తే బెంబేలెత్తిపోయే పరిస్థితి దాపురించిందన్నా అతిశయోక్తి కాదు. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా కేజీ టమాటా 150 నుంచి 200 రూపాయల ధర పలుకుతోంది.
నిన్నమొన్నటివరకూ రైతులను కంటతడి పెట్టించిన టమాటా ధర.. ఇప్పుడు కొంతమంంది రైతుల జీవితాల్లో సంతోషాలు విరజిమ్ముతోంది. ఒకప్పుడు పొలంలో పండించిన టమాటాలు మార్కెట్ కు తీసుకుని వెళ్తే... ఆ ఆటోకి సరిపడా డబ్బులు రాని సంఘటనలు కోకొల్లలు!
అయితే దళారులను దాటుకుంటే.. ప్రస్తుతం టమాటా రైతుకు మంచి రోజులొచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. దేశంలో పెరిగిన టమాటా ధరలు ఇలా కొంతమంది రైతుల జీవితాల్లో కొత్త వెళుగులు నింపుతోంది. అందులో భాగంగా తెలంగాణకు చెందిన ఒక రైతును కోటీశ్వరుడిని చేసింది.
అవును... టమోటాను పండించిన మెదక్ రైతు బీ మహిపాల్ రెడ్డి.. కోట్ల రూపాయలను ఆర్జించారు. ఈ ఒక్క సీజన్ లోనే టమోటా సాగు చేయడం ద్వారా రెండు కోట్ల రూపాయలను ఆర్జించారాయన. ఇదే సమయంలో మరో కోటి రూపాయల విలువ చేసే టమోటాను అమ్మకాలకు ఉంచారు. ఒకట్రెండు రోజుల్లో అవి కూడా అమ్ముడుపోతాయని ఆశిస్తోన్నారు.
ప్రస్తుతం ఈ విషయం మెదక్ లోనే కాదు.. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. పెరిగిన ధరల సంగతి కాసేపు పక్కనపెడితే... రైతుకు మంచి రోజులు రావాలని, గిట్టుబాటు ధరలు దక్కాలని, రైతు రాజు కాకపోయినా.. బానిస కాకూడదని మెజారిటీ జనాలు కోరుకుంటారు!
మహిపాల్ రెడ్డి విషయంలో అదేజరిగిందని అంటున్నారు. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి.. పదోతరగతి ఫెయిల్ అయ్యి ఇక చదువు మానేశాడు. అనంతరం వ్యవసాయం వైపు మళ్లాడు. వరిసాగు చేసిన ఆయనకు నష్టం వచ్చింది. ఈ క్రమంలో సుమారు 8 ఎకరాల్లో టమాటా పంటవేశారు.
ఏప్రిల్ రెండోవారం నుంచి టమోటా సాగు ఆరంభించారు. ఏ- గ్రేడ్ టమోటాను పండించారు. అద్భుతమైన దిగుబడిని సాధించారు. అధిక వర్షం వల్ల పంటను కొంత నష్ట పోయినప్పటికీ నిరుత్సాహ పడలేదు. ఈ సీజన్ లో మొత్తంగా రెండు కోట్ల రూపాయలను ఇప్పటికే ఆర్జించారు! ఇదే సమయంలో మరో కోటి రూపాయల సరుకు రెడీగా ఉందని చెబుతున్నారు!
అయితే మహిపాల్ రెడ్డి సుమారు 100 ఎకరాల ఆసామి అని తెలుస్తుంది. ఇందులో 60 ఎకరాల్లో వరి పండిస్తుండగా.. మిగిలిన 40 ఎకరాల్లోనూ కాయగూరలు, టమాటాలు పండిస్తున్నారు. ఈసారి టమాటా ధర ఆకాశానికి అంటడంతో అది మహిపాల్ రెడ్డికి అద్భుతంగా కలిసొచ్చింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్... మహిపాల్ రెడ్డినికి పిలిపించుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి, అతని భార్య సోమవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనను శాలువాతో కప్పి సన్మానించారు.