కరీనా వల్ల హర్టయిన నారాయణమూర్తి... సెటైర్ వేసిన సుధామూర్తి!
"ఓసారి నేను లండన్ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారు" అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నారు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దంపతులు మాట్లాడిన ఆసక్తికర సంభాషణ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అలాఅని వీరిద్దరూ సంభాషించింది బిజినెస్ గురించో, ఐటీ ఇండస్ట్రీ గురించో కాదు సుమా... బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి.
అవును... ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి నారాయణమూర్తి దంపతులు మాట్లాడిన ఆసక్తికర సంభాషణ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోరని నారాయణ మూర్తి వ్యాఖ్యానించగా.. ఆ మాటలను ఆయన సతీమణి సుధామూర్తి వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు.
వివరాళ్లోకి వెళ్తే... కొంతకాలం క్రితం నారాయణ మూర్తి దంపతులు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సయమంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ కరీనా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన నారాయణ మూర్తి... "ఓసారి నేను లండన్ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారు" అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నారు.
అనంతరం ఆ గతాన్ని కంటిన్యూ చేస్తూ... "ఆ సమయంలో ఆమెను చూసి చాలా మంది వచ్చి పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మనదగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే" అని ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ చర్చా కార్యక్రమంలో పక్కనే ఉన్న సతీమణి సుధామూర్తి ఆయన మాటలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కరీనాను వెనకేసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగా... "ఆమెకు కోట్ల మంది అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుంది" అని వెనకేసుకొచ్చారు.
అనంతరం... "ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి, కంపెనీ ఫౌండర్ అయిన నారాయణ మూర్తికి 10వేల మంది అభిమానులు ఉంటారేమో..! కానీ, సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా" అని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడి వాతావరణం అంతా నవ్వులతో నిండిపోయింది.
అయినప్పటికీ అక్కడితో ఆగని నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగించారు. "ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం ఆ ప్రేమను తిరిగి చూపించాలి. అది ఏ రూపంలోనైనా సరే.." అని అన్నారు. ప్రస్తుతం ఈ సంభాషణ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.