జపాన్ ట్రైలర్: సింహం సిక్ - పందికొక్కుల ప్రిస్క్రిప్షన్
తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జపాన్' సినిమాపై మంచి ఆసక్తే ఉంది.
తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జపాన్' సినిమాపై మంచి ఆసక్తే ఉంది. ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా.. తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీ.. ఓ దొంగ పాత్రను పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ప్రారంభంలో చూపించారు. 'బుల్లి చేప.. అమ్మ చేప కోసం ఓ కన్నెం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట' అంటూ కార్తీ వాయిస్ ఓవర్‌తో ఆరంభమైంది. చిన్నప్పుడే దొంగగా మారిన జపాన్.. ఆ తర్వాత ఏకంగా గజదొంగ అవుతాడు. 'ఆ బుల్లి చేప తిమింగలం అయింది' అనే డైలాగ్‌తో తనని తానే ఎలివేట్ చేసుకున్నారు కార్తి.
ఈ క్రమంలోనే అతడు హైదరాబాద్‌లో మినిష్టర్ ఇంట్లో రూ.200 కోట్లు దొంగతనం చేసి, హత్య కూడా చేశాడన్న నింద పడుతుంది. దీంతో పోలీసులు జపాన్‌ను ఎన్‌కౌంటర్ చేయడానికి తిరుగుతూ ఉంటారు. చేయని నేరానికి జపాన్‌ను ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్‍లు వేసినా తిమింగలం వలలో పడదుగా' , 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట.' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరి ప్రత్యర్థుల నుంచి జపాన్ ఎలా బయటపడ్డాడు అనేదే కథగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇంకా ప్రచార చిత్రంలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌తో కార్తీ రొమాన్స్ కూడా చేశారు. సునీల్ విభిన్నమైన గెటప్‌లో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కార్తీ డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్‍గా ఇంట్రెస్టింగ్గా ఉంది. కామెడీగా ఉంటూనే యాక్షన్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటోంది.
మొత్తంగా కార్తి క్రేజీ దొంగగా అదరగొట్టారు. ఇక ఈ చిత్రం దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ చెప్పింది. అంటే నవంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.