'ప్రతినిధి 2' కాన్సెప్ట్ టీజర్.. నారా రోహిత్ థ్రిల్లింగ్ పాయింట్!
ఏపీలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది
కమర్షియల్ ఫార్మాట్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నారా రోహిత్. చివరిసారిగా వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ప్రతినిధి 2తో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన రోజుకో అప్డేట్ ఇస్తున్నారు. తాజాగా.. మరో కొత్త అప్డేట్ ఇచ్చారు. జులై 25 రోహిత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ వీడియో అంతా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్.. వార్తాపత్రికలను హైలైట్ చేస్తూ చూపించారు. ఆ పత్రికల్లో ఓట్లు మాయం, యువత రావాలి, హింస పెరిగిపోతోంది వంటి హెడ్ లైన్స్‌ను బాగా హైలైట్ చేసి చూపించారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ కార్యాలయంలో బాంబ్ బ్లాస్ జరిగి అది పేలిపోతుంది. దాని వెనకే.. వేల మంది జనం ఉన్న పొలిటికల్ మీటింగ్ సభ ఒకటి జరుగుతున్నట్లు చూపించారు.
సమాజంలో జరిగే అసమానతలను ఎదుర్కొనేందుకు ఒక్కడు నిలబడతాడు అంటూ మళ్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా ఈ వీడియో చూస్తుంటే ఇది ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది.
ఇకపోతే ఈ ప్రతినిథి 2 సినిమా విషయానికొస్తే.. తొమ్మిదేళ్ల క్రితం నారా రోహిత్ హీరోగా చేసిన ప్రతినిధికి సీక్వెల్ ఇది. తొలి భాగం అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఈ రెండో భాగం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. దీనికి టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించబోతుండటం విశేషం.
ఏపీలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై.. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫీ బాధ్యతలు చూసుకోబోతున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.