కేంద్ర మంత్రి కుమార్తెపై ఆ వివాదాస్ప‌ద ట్వీట్ తొల‌గించాల్సిందేనా?

Update: 2022-07-29 11:44 GMT
కేంద్ర కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీకి ఢిల్లీ హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. స్మృతి 18 ఏళ్ల కూతురు గోవాలో బార్ న‌డుపుతోంద‌ని.. ఇందుకోసం అక్రమ ప‌ద్ద‌తుల్లో మ‌ర‌ణించిన వ్య‌క్తి పేరుతో లైసెన్సు పొందార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారిపై స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టులో ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఢిల్లీ హైకోర్టు కేంద్ర మంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

స్మృతి ఇరానీ కుమార్తెపై కాంగ్రెస్ నేత‌లు ట్విట‌ర్ లో పెట్టిన ట్వీట్ ను తొల‌గించాల‌ని కోర్టు వారిని ఆదేశించింది. అంతేకాకుండా వారికి నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు జైరామ్ ర‌మేష్, ప‌వ‌న్ ఖేరా, నెట్టా డిసౌజా త‌దిత‌రుల‌కు పరువు న‌ష్టం కేసులో కోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ నేత‌లు స్మృతి కుమార్తెపై చేసిన వివాదాస్ప‌ద ట్వీట్ ను కూడా 24 గంట‌ల్లో తొలగించాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాంగ్రెస్ నేత‌లు క‌నుక ఆ అభ్యంత‌రక‌ర ట్వీట్ ను తొల‌గించ‌క‌పోతే సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్ట‌ర్ ఆ ట్వీట్ ను తొల‌గిస్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

కాగా డిగ్రీ చ‌దువుతున్న‌ త‌న కూతురిపై బార్ వ్య‌వ‌హారంలో అసత్య ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ స్మృతి ఇరానీ... కాంగ్రెస్ నేత‌లు జైరామ్ రమేష్, పవన్ ఖేరాలపై 2 కోట్లకు పరువు నష్టం కేసు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తన కుమార్తె చ‌దువుకుంటోంద‌ని ఎలాంటి బార్‌ను నిర్వహించడం లేదని.. తాను కాంగ్రెస్ నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నాన‌నే కార‌ణంతో త‌న కుమార్తెను కాంగ్రెస్ నేత‌లు ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని స్మృతి ఇరానీ ఆరోపిస్తున్నారు.

కాగా ఈ వ్య‌వ‌హారంలో కోర్టు నోటీసులు త‌మ‌కు అందాక త‌మ వివ‌ర‌ణ కోర్టులో తెలియ‌జేస్తామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ జైరామ్ ర‌మేష్ తెలిపారు. స్మృతి కుమార్తె బార్ కు సంబంధించి త‌మ వ‌ద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని.. వాటిని కోర్టుకు స‌మ‌ర్పిస్తామ‌ని రమేష్ పేర్కొన్నారు.

ఆ రెస్టారంట్‌కు రెండు లైసెన్సులు ఉన్నాయన్నారు. గోవా చట్టం ప్రకారం బార్ అండ్ రెస్టారంట్ నిర్వహణ కోసం ఒక లైసెన్స్‌ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని జైరామ్ ర‌మేష్ అంటున్నారు. అదే సమయంలో ఈ బార్‌కు రెస్టారంట్ నిర్వహించే లైసెన్స్ లేదని చెబుతున్నారు.
Tags:    

Similar News