ఆగ్ర‌రాజ్యానికి కాల్పుల రోగం..!

Update: 2015-07-17 08:54 GMT
ప్ర‌పంచానికి పెద్ద‌న్న అయిన అమెరికాలో గ‌న్‌క‌ల్చ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ గ‌న్ క‌ల్చ‌ర్ రోజురోజుకీ స‌రికొత్త స‌మ‌స్య‌ల్ని తెచ్చి పెడుతోంది. ఎప్పుడు.. ఎక్క‌డ‌.. ఎవ‌రు.. ఎవ‌రి మీద కాల్పులు జ‌రుపుతారో అర్థం కాని ప‌రిస్థితి. చ‌ట్టం త‌మ‌కిచ్చిన స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేయ‌టం.. ఆ దిశగా ప‌లు సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌టం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌ను రేపుతోంది.

అంతేకాదు.. భ‌యాందోళ‌న‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. పిచ్చోడి చేతిలో రాయిలా.. కొంద‌రు గ‌న్ ను వినియోగించ‌టంతో జ‌నాలు భ‌యం నీడ‌న బ‌త‌కాల్సిన దుస్థితి. తాజాగా అలాంటి ప‌రిస్థితే మ‌రోసారి చోటు చేసుకుంది.సాయుధుడైన ఒక వ్య‌క్తి టెన్నిసి లోని చ‌ట్ట‌నోగా అనే ప్రాంతంలో ఒక మిల‌ట‌రీ రిక్రూట్ మెంట్ కేంద్రం మీద‌.. మిల‌ట‌రీకి సంబంధించిన మ‌రో దాని మీద‌న విచ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పులు జ‌రిపారు.

ఈ ఘ‌ట‌న‌లో ఒక పోలీసు గాయ‌ప‌డ్డాడు. మ‌రింత న‌ష్టం వాటిల్లకుండా పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని కాల్చిపారేశారు. అమెరికా నేవికి సంబంధించిన కేంద్రంపై ఈ వ్య‌క్తి కాల్పుల‌కు పాల్ప‌డ్డాడు. ఇంత‌కీ.. పోలీసుల కాల్పుల్లో మ‌ర‌ణించిన వ్య‌క్తి ఎందుకిలా కాల్పులు జ‌రిపాడ‌న్న‌ది తేలాల్సి ఉంది. ఉగ్ర‌వాద సంబంధ‌మైన కార్య‌క‌లాపాల‌తో అత‌నికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమైనా విప‌రీత‌మైన గ‌న్ క‌ల్చ‌ర్‌.. ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌ల కార‌ణంగా.. అమెరికాలోని ప్ర‌జ‌ల్లో తెలియ‌ని కొత్త భయానికి గురి అవుతున్నార‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News