బెయిల్ అవుట్ తో గ్రీస్ బయటపడిందా?

Update: 2015-07-13 22:51 GMT
ప్రపంచాన్ని వణికించిన గ్రీస్ సంక్షోభం తాత్కలికంగా ఒక కొలిక్కి వచ్చింది. అయితే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పట్ల గ్రీస్ ప్రజలు ఏ మాత్రం ఇష్టపడటం లేదన్న వాదన వినిపిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన గ్రీస్.. యూరోజోన్ నుంచి బయటకు వచ్చేసి.. తనదైన కరెన్సీని ముద్రించుకొని తన బతుకు బతకాలని భావించటం.. దానికి గ్రీస్ ప్రజలు సైతం తమ రెఫరెండంలో సానుకూలంగా స్పందించట తెలిసిందే.

గ్రీస్ కానీ.. యూరో జోన్ నుంచి వస్తే.. అది యూరో జోన్ ఉనికికి ప్రశ్నార్థకంగా మారటంతో పాటు.. పలు దేశాలు ఇలాంటి సంక్షోభాల్లో కూరుకుపోవటం ఖాయమని.. మొత్తం యూరోజోన్ కే దెబ్బ పడుతుందని భావన వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే.. ఐఎంఎఫ్ అధిపతి.. ఫ్రాన్స్ అధ్యక్షుడు.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు.. జర్మనీ ఛాన్సెలర్.. గ్రీస్ ప్రధానితో కలిసి దాదాపు 17 గంటల పాటు సాగిన చర్చల అనంతరం.. గ్రీస్ కు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వటానికి యూరో దేశాలు అంగీకరించాయి.

రానున్న ఐదేళ్ల వ్యవధిలో దాదాపు రూ.6లక్షల కోట్ల సాయం అందించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో.. కఠినమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. మరి.. తాజా ఉద్దీపన చర్యలతో గ్రీస్ మరింత కష్టాల్లో కూరుకుపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. ఆర్థిక సంస్కరణల్ని కఠినంగా అమలు చేస్తే.. పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది.

తాజాగా కుదిరిన ఒప్పందం నేపథ్యంలో.. ఇప్పటివరకూ ఆ దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి భారీ కోతకు గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెన్షన్ ప్రయోజనాలకు భారీగా దెబ్బ తగులుతుందని.. వ్యాట్ పోటు మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. పెరిగే పన్నుల భారం గ్రీస్ ప్రజల్లో మరింత అసంతృప్తికి కారణం అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గ్రీస్ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్లేనని యూరోపియన్ దేశాలతో పాటు.. ప్రపంచం భావిస్తుంటే.. తాము మరింత అప్పుల ఊబిలో చిక్కుకుపోయామని గ్రీస్ ప్రజలు భావిస్తున్నారు. మరి.. గ్రీస్ ప్రజలవి అనుమానాలా?.. ప్రస్తుతం ప్రకటించిన  బెయిల్ అవుట్ ప్యాకేజీతో గ్రీస్ బయట పడుతుందా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News