జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగినట్లేనా?
ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాహ్నవి కందుల (23).. జనవరి 23 - 2023న సియాటెల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాహ్నవి కందుల (23).. జనవరి 23 - 2023న సియాటెల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి గంటకు 119 కిలోమీటర్స్ వేగంతో వాహనం నడుపుకుంటూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీ కొట్టాడు. దీంతో.. సుమారు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
అయితే... విధినిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని.. అందువల్ల సదరు అధికారిపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీసు శాఖ భావించింది. ఇదే సమయంలో ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించిందనే కామెంట్లు వినిపించాయి. ఈ వ్యవహారంపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ సందర్భంగా ‘జస్టిస్ ఫర్ జాహ్నవి’ పేరుతో విద్యార్థులు ఫ్లకార్డులు చేతపట్టి రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురుచూసిన సియాటెల్ పోలీసు శాఖ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా... కెవిన్ డేవ్ ను విధుల నుంచి తొలగించింది.
అవును... జాహ్నవి కందుల మరణానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డేవ్ సియాటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి తొలగించబడ్డాడు. ఈ సందర్భంగా స్పందించిన సియాటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ తాత్కాలిక చీఫ్ సూ రెహర్ మాట్లాడుతూ... ఈ ఘటనలో ఆయన ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చు అని మొదలుపెట్టారు.
అనంతరం.. డ్రగ్స్ ఓవర్ డోస్ అయిన బాధితుడ్ని రక్షించాలని తాపత్రయపడ్డాడు అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన వాహనంతో ఢీకొట్టి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యారని.. అయితే.. ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారని.. ఫలితంగా సియాటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు తెచ్చారని వెల్లడించారు.
ఇదే సమయంలో డిపార్ట్ మెంట్ లోని నాలుగు పాలసీలను ఆయన ఉల్లంఘించారని తెలిపిన సూ రెహర్... అందుకే డిపార్ట్ మెంట్ నుంచి డేవ్ ను తొలగించినట్లు తెలిపారు. కాగా.. అంతక ముందు ఇదే కేసులో ఆమె మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్ ను గత ఏడాది సెప్టెంబర్ లోనే విధుల్లోంచి తొలగించిన సంగతి తెలిసిందే.
కర్నూలు జిల్లాకూ చెందిన కందుల జాహ్నవి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధనంగా ఆమె ప్రాణానికి విలువ కడుతూ ఓ అధికారి చులకనగా మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇందులో భాగంగా.. ఆమె ఓ సాధారణ వ్యక్తి అని.. ఆమె మరణానికి విలువ లేదని.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్ల చెక్ ఇస్తే సరిపొంతుందని వెకిలిగా నవ్వుతూ మాట్లాడాడు. దీనికి సంబంధించిన క్లిప్ వెలుగులోకి రావడంతో తీవ్ర దుమారం రేగింది.
ఈ నేపథ్యంలో ఇతడి వ్యవహారంపైనా దర్యాప్తు జరిగిన ఉన్నతాధికారులు.. గత ఏడాది అతడిని విధుల్లోంచి తొలగించారు. ఈ నేపథంలో తాజాగా కెవిన్ డేవ్ సియాటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి తొలగించబడ్డాడు.