కొండకు రంగేసి.. కొంప మీదకు తెచ్చుకున్నాడు

Update: 2015-08-06 05:39 GMT
అందం పిచ్చి.. ఇప్పుడు కేసుల వరకూ తీసుకొచ్చిన వైనం చైనాలో చోటు చేసుకుంది. ఇంటిని అందంగా అలంకరించుకోవాలని భావించటం మామూలే. ఇంటితోపాటు.. ఇంటి పరిసరాలు కూడా చక్కగా.. శుభ్రంగా.. అందంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అయితే.. ఇక్కడే లాజిక్ మర్చిపోయి.. కేవలం అందం మీద మాత్రమే ఫోకస్ చేసిన యాంగ్ జిగాంగ్ కు కొత్త కష్టం వచ్చి పడింది.

చైనాలోని కొండ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి మెరుగులు దిద్దుకున్న అతగాడు.. ఇంట్లో నుంచి పరిసరాల వైపు చూసినప్పుడు.. తెల్లగా.. బోసిగా ఉన్న కొండ అతనికి చిరాకు పుట్టించింది. తెల్లగా పాలిపోయినట్లు.. అందం చందం లేకుండా ఉన్న కొండను కాస్తంత కలర్ ఫుల్ గా మార్చేసే పోలా అనుకున్న తడువనే పనిలోకి వెళ్లిపోయాడు.

తెలిసిన వారిని సంప్రదించి.. పెయింటర్లను మాట్లాడేశాడు. రంగులు కొనేసి.. కొండ మొత్తాన్ని బ్లూ కలర్ తో తీర్చి దిద్దాలని భావించాడు. కేవలం వారం వ్యవధిలో దాదాపు 21,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రంగులేయించాడు.

రంగులు అద్దుతున్నకొద్దీ కొత్త అందాల్ని సంతరించుకుంటున్న కొండను చూసుకొని తెగ ఆనందపడిపోతున్న ఇతగాడికి కరెంటు షాక్ కొట్టినంత పనైంది. ఎందుకంటే.. స్థానికంగా ఉన్న పర్యావరణ అధికారులకు కొండ.. దానికేస్తున్న రంగు యవ్వారం దృష్టికి వచ్చింది. వెంటనే రూల్ బుక్ వెతికిన వారు.. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ.. పర్యావరణాన్ని పాడు చేస్తూ ఈ రంగుల గోలేందని మండిపడ్డారు. కేసు బుక్ చేశారు.

అందం కోసం తాపత్రయ పడటం కూడా ఇన్ని ఇబ్బందులు ఎదురవుతాయా? అని ప్రశ్నిస్తున్నాడు. అతగాడు చేసింది నేరమని తేలితే మాత్రం భారీగా శిక్ష పడుతుందని చెబుతున్నారు. మరి.. దీనిపై ఉన్నతాధికారులు ఏం నిర్ణయిస్తారో. అయినా.. ప్రకృతి ఇచ్చిన కొండను సహజసిద్ధంగా వదిలేయక.. ఈ అందం గోలేందని.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. మంచి చేయాలనుకోవటం తప్పు కాదు.. కానీ.. ఆ క్రమంలో తాను హద్దులు దాటకూడదన్న చిన్న లాజిక్ మిస్ అయి.. పెద్దకష్టంలోనే చిక్కుకున్నాడు.
Tags:    

Similar News