కోర్టులో జడ్జిగా ఆమె.. నేరస్తుడిగా అతను

Update: 2015-07-05 09:20 GMT
రియల్‌లైఫ్‌లో ఎదురయ్యే ఘటనలు చాలానే రీల్‌ లైఫ్‌లోనూ చోటు చేసుకుంటాయి. కాస్తంత అరుదుగా జరిగే ఇలాంటివెన్నో ఘటనలు పెద్దగా బయటకు రావు. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన పలువుర్ని ఆకర్షిస్తోంది.

మియామీ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అక్కడి ఒక కోర్టులో ఒక కేసుకు సంబంధించి న్యాయమూర్తి మెండి గ్లేసర్‌ మీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా ఒక కేసును విచారిస్తున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టి పట్టి చూసిన ఆమె.. చిన్నప్పుడు నిందితుడు నార్టీనస్‌ మిడిల్‌ స్కూల్‌లో చదివావా? అని అడిగారు. నిందితుడు అవునని చెప్పటంతో.. మీరు హార్డర్‌ బాల్ట్‌ కదా? అని ఆశ్చర్యకరంగా ప్రశ్నించారు.

సదరు నిందితుడు అవునని చెప్పటంతో.. ఆమె ఒక్కసారి గతాన్ని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు చదువుల్లో.. ఆటల్లో చురుగ్గా ఉంటూ.. అందరికి ఆదర్శంగా ఉండే మీరు ఇలా మారటం ఏమిటని సూటిగా ప్రశ్నించటంతో.. తన చిన్ననాటి స్నేహితురాల్ని గుర్తించిన సదరు నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

చిన్నప్పుడు తామిద్దరం కలిసి ఆడుకున్నది.. చదువుకున్న విషయాల్ని జడ్జి స్థానంలోని చిన్ననాటి స్నేహితురాలి అడిగేసరికి.. అతగాడి ముఖం సిగ్గుతో కందిపోయింది. నోట వెంట మాట రాలేదు.

భావోద్వేగంతో సదరు జడ్జి కాసేపు పాత గురుతుల్లోకి వెళ్లిపోయినా.. కేసు విషయంలో మాత్రం న్యాయం వైపునే మొగ్గు చూపారు. చిన్ననాటి స్నేహితుడు అన్న విషయాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కఠిన శిక్షనే విధించారు. డ్రగ్స్‌ సరఫరా కేసులో నిందితుడైన అతడికి ఏకంగా 44వేల డాలర్ల జరిమానా విధించి.. మరోసారి అలాంటి తప్పు చేయొద్దని హెచ్చరించారు. స్నేహం.. స్నేహమే.. వృత్తి ధర్మం.. వృత్తి ధర్మమేనన్న విషయాన్ని ఆమె మరోసారి నిరూపించారు.

Tags:    

Similar News