అక్కడ మగాళ్లే బురఖా ధరించాలి

Update: 2015-06-25 03:50 GMT
సాంకేతిక విప్లవంతో ప్రపంచం ఎంత కుగ్రామం అయినా.. తెలియని విషయాలెన్నో. చిత్రవిచిత్రమైన ఆచార వ్యవహారాలు.. ఒక పట్టాన బయటకు రాని సంస్కృతులు చాలానే కనిపిస్తాయి. తాజాగా మత ఛాందసానికి నిలువెత్తు రూపమైన బకొహరం తీవ్రవాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. వెయ్యేళ్ల నుంచి తమదైన విలక్షణ జీవితాన్ని అనుభవిస్తున్న త్వారెగ్‌ అనే తెగ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతోంది.

తరచూ ఈ తీవ్రవాదులు జరిపే దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ తెగకు సంబంధించిన అంశాలు ఎంతో ఆశ్చర్యకరంగా.. ఆసక్తికరంగా కనిపిస్తాయి. మహిళలు స్వేచ్ఛగా ఉండే ఈ తెగ సహారా ఎడాది ప్రాంతంలో సంచార జాతిగా ఉంటుంది.

దాదాపు కోటిన్నర మంది ఉండే ఈ తెగ వారిలో సంప్రదాయాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఈ తెగలోని పురుషుడు బురఖాలు ధరించాల్సి ఉంటుంది. మహిళలు స్వేచ్ఛగా వ్యవహరిస్తుంటారు. ఈ తెగకు చెందిన మహిళలు పెళ్లి వరకు ఎంతమంది పురుషులతోనైనా గడిపే వీలు ఉంటుంది.

ఇక.. ఈ తెగలోని వారి అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. పొద్దుపోయిన తర్వాత ఏ యువకుడైనా.. ప్రేయసి ఉన్న గుడారంలోకి వెళితే.. వారికి ఏకాంతం కలిగించేందుకు వీలుగా.. ఆ గుడారంలోని వారంతా బయటకు వెళ్లిపోతారు. అయితే.. ఇక్కడ నిబంధన ఏమిటంటే..పొద్దుపోయిన తర్వాత గుడారంలోకి వచ్చే మగాడు.. తెల్లవారుజాముకు ముందే తిరిగి వెళ్లిపోవాలి. పెళ్లి వరకూ ఇలాంటి విషయాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

పెళ్లి తర్వాత మాత్రం మహిళ భర్తతోనే ఉండాలి. అయితే.. పెళ్లి తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకునే వెసులుబాటు ఉంది. పెళ్లి సందర్భంగా మహిళలు పురుషుడికి వరకట్నంగా గుడారం.. ఒంటె లాంటివి ఇస్తుంటారు. పెళ్లి కార్యక్రమాన్ని ఎంత వైభవంగా జరుపుతారో.. విడాకుల కార్యక్రమాన్ని కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు.

ఎందుకంటే.. విడాకుల కార్యక్రమం ద్వారానే సదరు మహిళ.. మరో పెళ్లికి సిద్ధంగా ఉందన్న విషయం తెలిసేలా చేస్తుందని ఈ తెగ వారు భావిస్తారు. ఒక మహిళ ఎన్నిసార్లు అయినా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. విడాకుల సమయంలో భార్యతో పాటే వారి పిల్లలు ఉండిపోతే.. భర్త మాత్రం తల్లి వద్ద ఉండిపోవాలి.

పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా ఓంటెల్ని నడుపుతుంటారు. అరబిక్‌కి దగ్గరగా ఉంటే భాష మాట్లాడే ఈ తెగవారిలో మత ఛాందసం ఏమాత్రం లేదంటూ వారిపై ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. ఈ తెగ మహిళల్ని ఉగ్రవాదులు బానిసలుగా చేసుకుంటున్నారు.

మోలి.. నిగర్‌.. ఉత్తర నైజీరియా.. ఆగ్నేయ లిబియా.. అల్జీరియా దేశాల్లో ఈ తెగ వారు జీవిస్తుంటారు. పురుషులు మాత్రం పక్కాగా బురఖా ధరించాల్సిందే. ఇక్కడ ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే.. ఇంటికి పెద్ద మహిళే అయినప్పటికీ.. నిర్ణయాలు తీసుకునేది మాత్రం పురుషుడే కావటం. అంతేకాదు.. రాజకీయాలు నిర్వహించేది కూడా పురుషుడే. బయట వ్యవహారాలు పురుషుడు చక్కబెడితే.. ఇంట్లోని పనుల్ని.. పిల్లల బాధ్యతల్ని మహిళలే చేపడతారు.

Tags:    

Similar News