7/జి సీక్వెల్.. ఇది వర్కవుటయ్యేదేనా?
దాదాపు రెండు దశాబ్దాల కిందట అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకులను కదిలించేసి సినిమా
దాదాపు రెండు దశాబ్దాల కిందట అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను కదిలించేసి సినిమా 7/జి బృందావన కాలనీ. నిర్మాత ఏఎం రత్నం చిన్న కొడుకు రవికృష్ణ కథానాయకుడిగా, సోనియా అగర్వాల్ కథానాయికగా విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఈ చిత్రం యువత మీద మామూలు ముద్ర వేయలేదు. సినిమా చూసి బయటికి వస్తున్న వాళ్లలో షాక్ ఎక్స్‌ప్రెషన్ ఆ సినిమా వారిపై ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పడానికి రుజువుగా నిలిచింది.
చాన్నాళ్ల పాటు ఆ సినిమా ప్రేక్షకులను వెంటాడింది. కాల క్రమంలో అదొక కల్ట్ మూవీగా నిలబడిపోయింది. ఇప్పుడు చూసినా రిఫ్రెషింగ్‌గా అనిపించే సినిమా అది. ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఐతే ఎట్టకేలకు 7/జి సీక్వెల్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
ఈ సీక్వెల్లో సెల్వ తన తమ్ముడు ధనుష్‌నే హీరోగా ఎంచుకుంటాడని గతంలో ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు మాత్రం రవికృష్ణతోనే సినిమా తీయడానికి రెడీ అయ్యాడట. అతడికి జోడీగా లవ్ టుడే ఫేమ్ ఇవానా లేదా శంకర్ తనయురాలు అదిని కథానాయికగా ఎంచుకునే అవకాశాలున్నాయట. 7/జికి అప్పట్లో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన సెల్వ రాఘవన్ ఆస్థాన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజానే సంగీతం అందించబోతుండగా... ఏఎం రత్నమే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం.
ఐతే ఈ కల్ట్ మూవీకి సీక్వెల్ అంటే ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతారనడంలో సందేహం లేదు కానీ.. అంచనాలను అందుకునే సినిమా వస్తుందా అన్నదే డౌట్. ఎందుకంటే సెల్వ రాఘవన్ ఇప్పుడు సరైన ఫాంలో లేడు. రవికృష్ణ అయితే సినిమాలు చేసి పదేళ్లు దాటిపోయింది. ఇలాంటి కలయికలో ఇప్పుడు సీక్వెల్ అంటే ఏమాత్రం వర్కవుట్ అవుతుందన్నదే సందేహం.