ట్రైలర్ టాక్: అభినవ్ గోమఠం సినిమాలో 'మస్త్ షేడ్స్' ఉన్నట్లున్నాయిగా!
ఈ క్రమంలో 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా' చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
కామెడీతో వెండి తెర మీద నవ్వులు పూయించిన ఎందరో హాస్యనటులు.. హీరోలుగా మారి ఆడియన్స్ ను అలరించారు. ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమటం కూడా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యారు. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. గతేడాది 'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోనూ సత్తా చాటారు. ఈ క్రమంలో 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా' చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలో అభినవ్ పాపులర్ డైలాగ్ 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'. ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైశాలి రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా, సిద్ శ్రీరామ్ పాడిన పాటతో జనాలోకి వెళ్ళింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసారు. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు.
టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాలో మస్తు షేడ్స్ ఉన్నట్లు థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అభినవ్ గోమఠం టెన్త్ తర్వాత చదువు మానేసి డిజైనర్ గా స్థిరపడాలనుకునే యువకుడిగా కనిపించారు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అతను తన ఊర్లోనే గోడలపై డిజైనింగ్స్ వేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే టౌన్ లో పెద్ద డిజైనర్ అయిన తన క్లాస్ మేట్ రేంజ్ కు చేరుకోవాలన్న అభినవ్.. ఫోటో షాప్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. బేసిక్స్ కూడా తెలియని అతను కంప్యూటర్ నేర్చుకోడానికి వైశాలి రాజ్ ట్యూటర్ గా ఉండే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాడు. ఆమెతో ప్రేమలో పడతాడు.
కంప్యూటర్ నేర్చుకున్న అభినవ్, సొంతంగా బిజినెస్ పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని దాటుకొని ఎలా ముందుకు వెళ్ళాడు? తన తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తానేంటో నిరూపించుకున్నాడా లేదా? అనేదే 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా' కథ అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇది కామెడీతో పాటుగా అన్ని భావోద్వేగాలు కలబోసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లారిటీ వచ్చింది. ట్రైలర్ లో 'బడికి వెళ్తే బాగుపడతావ్, చదువుకుంటే సెటిల్ అవుతావ్ అనేవి రూమర్స్' లాంటి డైలాగ్స్ నవ్వు తెప్పిస్తున్నాయి.
అభినవ్ ఎప్పటిలాగే తనకు అలవాటైన హాస్యంతో ఆకట్టుకున్నాడు. ఇందులో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పెషల్ రోల్ లో కనిపించారు. బిగ్ బాస్ ఫేమ్ అలీ రాజా, మోయిన్, నిజాల్ గల్ రవి, ఆనంద్ చక్రపాణి, రవీందర్ రెడ్డి, సూర్య, లావణ్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, ఫణి చంద్రశేఖర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజీవ్ టీ సంగీతం సమకూర్చగా, శామ్యూల్ అభి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. దీనికి రాధామోహన్ గుంటి డైలాగ్స్ రాసారు. సిద్ధార్థ్ స్వయంభు సినిమాటోగ్రఫీ నిర్వహించగా, రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేసారు.
'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా' ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. 'ఈ నగరానికి ఏమైంది' సినిమా చూసిన తరువాత అందరూ అభినవ్ లాంటి ఫ్రెండ్ కావాలని అనుకుంటారు. ఆయనలో చాలా షేడ్స్ వున్నాయి. స్నేహితుడిగా అతనంటే చాలా ఇష్టం. విడుదలకు ముందే ఈ సినిమాను కొంత మందికి చూపించారు. వాళ్లు చాలా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారని తెలుసుకుని ఈ ఈవెంట్‌కు వచ్చాను. మీరందరూ సినిమా చూస్తే నేను ఈ సినిమా ఈవెంట్‌కు ఎందుకు వచ్చానో తెలుస్తుంది. ఈ చిత్రానికి తప్పకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. అభినవ్ కు ఈ చిత్రం హీరోగా మంచి బిగినింగ్‌ను అందించాలని సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను అని అన్నారు.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. నేను ఇలాంటి ఈవెంట్స్ కు చాలా సార్లు వచ్చాను. కానీ ఇప్పుడు ఇది నా సినిమా వేడుక కావడంతో కాస్త ఒత్తిడిగా వుంది. ఇది నా లైఫ్ లో స్పెషల్ మూమెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ తిరుపతి రావుకు థ్యాంక్స్. హీరోగా చాలా ఆఫర్లు వచ్చాయి కానీ, నాకు తగ్గ కథ కోసం ఎదురుచూసి ఈ సినిమాను ఎంచుకున్నాను. ఈ సినిమాలో పాత్రలన్ని ఎంతో సహజంగా వుంటాయి. హీరో నిఖిల్ నాకు మంచి స్నేహితుడు. 'ఈ నగరానికి ఏమైంది' చూసి నిఖిల్ నాకు ఫోన్ చేసి తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఆయనతో కలిసి 'స్పై' చిత్రంలో కలిసి నటించాను. షూటింగ్ టైములో నాకు బాగా క్లోజ్ అయ్యాడు. ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఫిబ్రవరి 23న చిత్రాన్ని అందరూ థియేటర్లల్లో ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నిఖిల్ నటించిన 'సూర్య వర్సస్ సూర్య' చిత్రానికి సెట్ అసిస్టెంట్‌గా పనిచేశానని, ఇప్పుడు తన దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు నిఖిల్ అతిథిగా రావడం ఆనందంగా వుందన్నారు దర్శకుడు తిరుపతి రావు. ఇది అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా అని, తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుందని నిర్మాత కాసుల భవాని అన్నారు. ఈ వేడుకలో రామ్ మోహన్ రెడ్డి, అలీ రైజా, లావణ్య, మాటల రచయిత రాధామోహన్, కెమెరామెన్ సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.