హృతిక్ (X) ఎన్టీఆర్.. ఫైట్స్ కోసం హాలీవుడ్ దిగ్గజం
యష్ రాజ్ ఫిలింస్ నుంచి 'పఠాన్' తర్వాత మళ్లీ అంతటి విజయం అందుకునే క్రేజీ చిత్రంగా 'వార్ 2' గురించి చర్చ సాగుతోంది
యష్ రాజ్ ఫిలింస్ నుంచి 'పఠాన్' తర్వాత మళ్లీ అంతటి విజయం అందుకునే క్రేజీ చిత్రంగా 'వార్ 2' గురించి చర్చ సాగుతోంది. నిర్మాత ఆదిత్య చోప్రా - దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో 2019 హిట్ చిత్రం 'వార్' సీక్వెల్ ని తెరకెక్కిస్తుండగా, ఇందులో కబీర్ పాత్రను తిరిగి పోషిస్తున్న హృతిక్ రోషన్‌ను ఢీకొట్టేవాడిగా జూనియర్ ఎన్టీఆర్ టీమ్ లో చేరడంతో ఉత్సాహం పదింతలైంది. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా అలరించనుంది.
తాజా సమాచారం మేరకు... అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రజాటోస్ ఈ సినిమాకి స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేయనున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ 'కెప్టెన్ అమెరికా సిరీస్' సహా షారుఖ్ ఖాన్ 'జవాన్' కోసం అతడు అద్భుతమైన స్టంట్స్ ని కొరియోగ్రాఫ్ చేసారు. రజాటోస్ మునుపెన్నడూ లేని విధంగా భారతీయ ప్రేక్షకులను అబ్బురపరిచేలా స్పెషల్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. భారీ తారాగణంతో పాటు.. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారంతో వార్ 2 స్పెషల్ గా మారనుంది. పాన్ ఇండియా కేటగిరీలో వార్ 2ని బ్లాక్ బస్టర్ చేయడమే ధ్యేయంగా చోప్రాలు రాజీ లేకుండా పెట్టుబడులు సమకూరుస్తున్నారని తెలిసింది.
తన పార్ట్ షూట్ కోసం తారక్ ఇప్పటికే ముంబైలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముంబై కలీనా విమానాశ్రయంలో ఎన్టీఆర్ జూనియర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, హృతిక్ రోషన్ ఫోటోలు కూడా సెట్స్ నుండి బయటికి లీకయ్యయి. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలలో, హృతిక్, తారక్ చాలా స్పెషల్ గా కనిపించారు. ఈ ఇద్దరు దిగ్గజ స్టార్ల నుంచి అభిమానులు చాలా ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ యాక్షన్-ప్యాక్డ్ సీక్వెల్ షూటింగ్ కోసం 60 రోజులు కేటాయించారని కథనాలొచ్చాయి. ఎన్టీఆర్ జూలై చివరి నాటికి తన పార్ట్ ని పూర్తి చేస్తారని కూడా గుసగుస వినిపిస్తోంది.
ఒక సోర్స్ ప్రకారం.. ''హృతిక్ లాగానే, జూనియర్ ఎన్టీఆర్ కూడా వార్ కోసం 60 రోజులు షూటింగ్ కోసం కేటాయించారు. ఇందులో 25 నుండి 30 రోజుల కాంబినేషన్ షూట్ ఉంటుంది. YRF భారీ యాక్షన్ చిత్రాలను సమర్ధవంతంగా వేగంగా తెరకెక్కించడంలో ప్రావీణ్యం సంపాదించింది. ఈ టెంప్లేట్‌కు నటీనటుల నుండి ఎక్కువ కాల్షీట్లు అవసరం లేదు. అనవసరంగా బడ్జెట్ పెరగదు'' అని కూడా సోర్స్ వెల్లడించింది.