250 సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు రెండున్నర దశాబ్దాలగా నటుడిగా కొనసాగు తున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు రెండున్నర దశాబ్దాలగా నటుడిగా కొనసాగు తున్నాడు. కౌరవుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అజయ్ అటుపై ఖుషీ, స్టూడెంట్ నెంబర్ వన్, ఒక్కడు, సింహాద్రి, వర్షం నాటి నుంచి విక్రమార్కుడులో టిట్లా వరకూ అతడి జర్నీ ఎలా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో పాత్రల్లో నటించి నటుడిగా ఎంతో అనుభవం సంపాదించాడు. ప్రతినాయకుడిగా, సపోర్టింగ్ రోల్స్, పాజిటివ్ రోల్స్, అన్నా-తమ్ముడు ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు.
నేటికి నటుడిగా కొనసాగుతున్నాడు. త్వరలో `పొట్టేల్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ అనుభవాల్ని పంచుకున్నాడు. అవేంటో ఆయన మాటల్లోనే.. `చిత్ర పరిశ్రమలో 25 ఏళ్లగా నటుడిగా ఉండటం అన్నది చిన్న విషయం కాదు. ఇన్నేళ్ల పాటు ఇక్కడ నిలకడగా కొనసాగడం నా వరకూ ఓ పెద్ద గిప్ట్ గానే భావిస్తాను. 250 సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. సినిమాల సంఖ్య తగ్గిపోతుంది.
ఈ ఏడాది నాకు దేవర, మత్తువదలరా-2 తో రెండు విజయాలు దక్కాయి. నా పాత్రలతో కొన్ని మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. అవి చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు బలమైన భావోద్వేగాలు నిండిన పాత్రలు చేయాలని ఉంది. ఇటీవలే సింగం ఎగైన్ లో నటించాను. పుష్ప-2, గరుడన్ తెలుగు రీమేక్ సినిమాలు చేస్తున్నాను. ఏ నటుడికైనా ప్రతీ సినిమా ఓ కొత్త ఆవిష్కరణలాగే ఉంటుంది. అనుభవం సాధించే కొద్ది నటుడిగా లోలోపల ఉన్న భయాలు తగ్గి దేన్నైనా సాధించగలం అనే నేర్పు వస్తుంది.
పొట్టేల్ సినిమా విషయంలో నాకు సవాల్ గా అనిపించింది. ఇందులో పటేల్ గా ప్రతినాయకుడు ఛాయలున్న పాత్ర పోషించా. కొన్ని సన్నివేశాల్లో చీరకట్టులోనూ కనిపిస్తా. తెలంగాణలో దీన్ని సిగం అంటారు. అంటే దేవుడు పూనడం. అది వచ్చినప్పుడు వ్యక్తులు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది` అని అన్నారు.