టాలీవుడ్ ను వదిలేసిన టైగర్ పిల్ల!
ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే
ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. వీటిలో కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ లో సక్సెస్ అవగా మరికొందరు ఫెయిల్యూర్స్ అందుకుని మళ్లీ బాలీవుడ్ బాట పట్టారు. కృతి సనన్, కియారా అద్వానీ లాంటి హీరోయిన్లు ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించారు. ఇక తాజాగా బాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఆ హీరోయిన్ పేరే నుపూర్ సనన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు అయిన ఈమె మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎలాగైనా తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి రెస్పాన్స్ అనుకోకపోవడంతో ఆమె ఆశలన్నీ గల్లంతయ్యాయి.
తన అక్క కృతి సనన్ లాగే నుపూర్ సనన్ కూడా తెలుగులో మొదటి సినిమాతో పరాజయాన్ని అందుకుంది. కృతి సనన్ కూడా టాలీవుడ్ లోనే తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేసింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన '1 నేనొక్కడినే' సినిమాతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది. దాంతో కృతి సనన్ తిరిగి ముంబై వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో తన కెరీర్ ని కొనసాగిస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత పాపులర్ హీరోయిన్స్ లో కృతి సనన్ కూడా ఒకరు. ఈ క్రమంలోనే నుపుర్ సనన్ కూడా తన సోదరి కృతి సనన్ లాగే తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ లోనే కెరియర్ ని కొనసాగించాలని భావిస్తోందట. నిజానికి టైగర్ నాగేశ్వరావు తర్వాత మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప లో నుపుర్ సనన్ కి హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది.
ఏమైందో తెలియదు కానీ చివరి నిమిషంలో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారు. దాంతో నుపుర్ సనన్ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రజెంట్ బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఇకనుంచి కేవలం బాలీవుడ్ లోనే సినిమాలు చేయాలని ఈ ముద్దుగుమ్మ ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి కనీసం బాలీవుడ్ లో నైనా నుపుర్ హీరోయిన్ గా సక్సెస్ అవుతుందేమో చూడాలి.