హీరో సహాయకుల ఖర్చు తడిసిమోపెడు.. నిర్మాత బెంబేలు!
అయితే ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోవద్దని సాజిద్‌ను అభ్యర్థించడానికి చిత్రకథనాయకుడి తండ్రి, ప్రముఖ హీరో సునీల్ శెట్టి బరిలో దిగాల్సి వచ్చిందని కూడా కథనాలొస్తున్నాయి.
ప్రముఖ కథానాయకుడి కుమారుడు మూడేళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ తో కెరీర్ ప్రారంభించాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించి మూడో సినిమా కోసం సన్నాహకాల్లో ఉన్నాడు. కానీ ఇంతలోనే అతడి యాటిట్యూడ్, గుణగణాలపై నెగెటివ్ ప్రచారం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అతడు తన తప్పుడు ప్రవర్తనతో నిర్మాత ఆగ్రహానికి గురయ్యాడని, అతడి సినిమా ఆగిపోయిందని ప్రచారం సాగుతోంది. సంబంధిత వార్తలు మీడియాలో వైరల్ గా మారడంతో అతడి తండ్రి, స్టార్ హీరో షాక్ కి గురయ్యాడని తెలిసింది.
ఈ కథనంలో ప్రముఖ హీరో ఎవరు? అంటే.. అతడు సునీల్ శెట్టి. ఆయన తనయుడు అహన్ శెట్టి గురించే ఈ ప్రచారం. అహన్ తన తదుపరి చిత్రం 'సాంకి' షూటింగ్‌లో ఉన్నాడు. అయితే మీడియా కథనాల ప్రకారం... అతడి వెంట మంది మార్భలం, పరివారం ఖర్చు నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాకు కోపాన్ని, నిరాశను కలిగించాయని ప్రచారమవుతోంది. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం.. సాజిద్ తన 'పాత స్నేహితుడు' సునీల్ శెట్టికి మాటిచ్చాడు. అహన్ తొలి చిత్రం 'తడప్' బాక్సాఫీస్ వద్ద సరిగా పని చేయకపోవడంతో అహాన్‌కు రెండవ అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా అహన్ శెట్టి పరివారం ఖర్చు శ్రుతిమించిందని, దీని కారణంగా సాజిద్ ఇప్పుడు సినిమాను ఆపేస్తానని బెదిరించినట్టు కథనాలొచ్చాయి.
''సాజిద్‌కి ఈ సినిమా విషయంలో రెండో ఆలోచన ఉంది. శాటిలైట్, డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోతో బల్క్ డీల్ కుదుర్చుకోవడం వల్ల సాజిద్ డిజిటల్ హక్కులను విక్రయించగలిగినప్పటికీ, సినిమా శాటిలైట్ లేదా డిజిటల్ హక్కుల కోసం అతడు ఆశించినంత డబ్బును పొందలేకపోయాడు. దానికి తోడు హీరో ఖర్చు అదనపు భారం కాకూడదని భావించాడు'' అని పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ పేర్కొంది. సాజిద్ తన సినిమా కథానాయకుడి పరివారం (బందోబస్తు) ఖర్చులను చూశాక సహనాన్ని కోల్పోయాడు. అహాన్ సిబ్బంది ఖర్చులు (జుట్టు, మేకప్, స్పాట్, స్టైలిస్ట్, డ్రైవర్, చెఫ్, ట్రైనర్ వీళ్లందరి కోసం అయ్యే ఖర్చు) ప్రొడక్షన్ హౌస్ కి బదలాయిస్తున్నాడు. ఈ బిల్లులే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో సాజిద్ సూటిగా అహన్ ని బెదిరించాడు. ఇలా అయితే వ్యాపారం చేయలేనని చెప్పాడు. ప్రాజెక్ట్ రూపకల్పన అర్థవంతంగా ఉండాలి'' అని ఆవేదన చెందాడట.
అయితే ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోవద్దని సాజిద్‌ను అభ్యర్థించడానికి చిత్రకథనాయకుడి తండ్రి, ప్రముఖ హీరో సునీల్ శెట్టి బరిలో దిగాల్సి వచ్చిందని కూడా కథనాలొస్తున్నాయి. ఇది మాత్రమే కాదు... సాజిద్‌కు అధిక ఖర్చులకు సంబంధించినంత వరకు సహాయం చేయడానికి కూడా సునీల్ శెట్టి ముందుకొచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా పలువురు నిర్మాతలు నటీనటుల పరివారం ఖర్చుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకుముందు కరణ్ జోహార్ కూడా భారీ ఫీజులు డిమాండ్ చేస్తున్న నటీనటులపై విరుచుకుపడ్డాడు. నటీనటులు తమ పారితోషికాలను పునఃసమీక్షించుకోవాలని, మారిన పరిస్థితులను బట్టి ఆర్టిస్టులు కూడా మారాల్సి ఉందని, ఖర్చులు తగ్గించుకోవాలని కూడా కరణ్ సూచించారు. కరణ్ కంటే ముందు అనురాగ్ కశ్యప్ కూడా నటీనటుల అసమంజసమైన డిమాండ్లు, వారి పరివారం బడ్జెట్ల పెరుగుదలకు నిర్మాతలు, ఏజెన్సీలను నిందించాడు. స్టార్‌ను బ్రాండ్‌గా మార్చడంలో ఏజెన్సీలు వేలు పెట్టిన తర్వాత ఖర్చులు పెరిగాయని ఆయన అన్నారు.