అఖండ తాండవం ప్రారంభం.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పుడు మళ్లీ వారి కలయికలో.. నాలుగో మూవీ వస్తుండడంతో ఆడియన్స్ తోపాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండ-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ వారి కలయికలో.. నాలుగో మూవీ వస్తుండడంతో ఆడియన్స్ తోపాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే అఖండ-2 తాండవం ప్రాజెక్ట్ రీసెంట్ గానే లాంఛ్ అయింది. హైదరాబాద్ లో కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ఆ వేడుకలో బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్వినితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పలువురు సెలబ్రిటీలు సందడి చేయగా.. ముహూర్తపు షాట్ కు బ్రాహ్మణి క్లాప్ కొట్టారు.
అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అఖండ-2 మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అదే సమయంలో పోస్టర్ తోపాటు రిలీజ్ డేట్ ప్రోమో పేరుతో గ్లింప్స్ ను బుధవారం విడుదల చేశారు.
వచ్చే ఏడాది 2025 దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. పోస్టర్ లో త్రిశూలం పట్టుకున్న బాలయ్య చేతిని చూపించారు. నటసింహం చేయి.. రుద్రాక్ష మాలలతో నిండిపోయింది. ఇక ప్రోమోలో బాలయ్య సినిమా లాంఛ్ సమయంలో చెప్పిన డైలాగ్ ను చూపించారు మేకర్స్.
"ఈ నేల అసురుడిది కాదు.. ఈశ్వరుడిది.. పరమేశ్వరుడిది కాదని తాకితే జరిగేది తాండవం.. అఖండ తాండవం.." అంటూ బాలయ్య చెబుతుండగా పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ప్లే చేశారు. శివుడి తాండవం చేస్తున్నట్లు విజువల్స్ ను గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే అఖండ 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో నేడు ప్రారంభమైంది. బాలకృష్ణతో కూడిన గ్రిప్పింగ్ ఫైట్ సీక్వెన్స్ తో షూట్ ను ప్రారంభించారు బోయపాటి. యాక్షన్ సీక్వెన్స్ ను రామ్- లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న అఖండ 2.. భక్తితో యాక్షన్ ను మిళితం చేస్తుందని మేకర్స్ హామీ ఇచ్చారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.