సినీ జగత్తులో చిరస్మరణీయుడు ఏఎన్నార్..!

ఏఎన్నార్ ఒక పేరు కాదు తెలుగు సినీ పరిశ్రమకు దిశా నిర్ధేశం చూపించిన ప్రస్థానం.

Update: 2024-09-20 09:23 GMT

ఏఎన్నార్ ఒక పేరు కాదు తెలుగు సినీ పరిశ్రమకు దిశా నిర్ధేశం చూపించిన ప్రస్థానం. అక్కినేని నాగేశ్వర రావు అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్. తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని అప్పటి పరిస్థితులకు ఎదురొడ్డి కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన మహా మనిషి. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి ఏఎన్నార్ కృషి అందరికీ తెలిసిందే.


ఇక సినిమాల విషయానికి వస్తే అది ఇది అని కాదు ఎలాంటి పాత్రైనా.. ఎలాంటి కథ అయినా ఏఎన్నార్ చేశారంటే అదిరిపోతుంది. అంతేకాదు ఆయన చేసిన సినిమాలు, పాత్రల వల్ల ఒక ట్రెండ్ సెట్ చేశారు ఏఎన్నార్. భగ్న ప్రేమికుడు అంటే దేవదాసు గుర్తొస్తాడు. అలానే ఆయన చేసిన మిస్సమ్మ, మాయాబజార్, మూగ మనసులు, బుద్ధిమంతుడు, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్ ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది.

తెలుగు చల చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్ ఎన్నో క్లాసికల్ హిట్లు అందించారు. ఆ తరం లవర్ బోయ్ గా ఏఎన్నార్ చేసిన ప్రేమకథా చిత్రాలు అప్పటి యువతని ఉర్రూతలూగించాయి. అంతేకాదు ప్రయోగాలు చేయడంలో కూడా ఆయన తన ప్రత్యేక శైళి చూపించారు. తన మీద విమర్శలు వచ్చిన ప్రతిసారి అలా చేసిన వారిని ముక్కున వేలేసుకునేలా చేశారు ఏఎన్నార్.

ఏఎన్నార్ ఒక నటుడిగానే కాదు తెలుగు చలచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో తన సపోర్ట్ అందించిన మహా మనిషి. చిత్ర పరిశ్రమ తనకు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ ని ఏర్పాటు చేశారు. అందులో తెలుగు సినిమా చిత్రీకరణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఏఎన్నార్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.

చలన చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్ చేసిన కృషికి గాను ప్రఖ్యాత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఆయన 10 ఐకానిక్ సినిమాలను సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు థియేటర్ లో మినిమం టికెట్ ధరతో రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చల చిత్ర పరిశ్రమ లో ఏఎన్నార్ ఒక లెజెండ్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన ఒక సారధి. ఆయన స్పూర్తి దాయకమైన జీవితం ఎంతోమంది యువతకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

అక్కినేని లెగసీని కింగ్ నాగార్జున కొనసాగిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా క్లాస్ మాస్ డివోషనల్ ఇలా అన్ని వెరైటీ కథలతో ఏఎన్నార్ ని గుర్తు చేస్తూ నాగార్జున అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఏఎన్నార్ చివరి సినిమా మనం అక్కినేని ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. ఆ సినిమాతో పాటు ఏఎన్నార్ నటించిన క్లాసిక్ సినిమాలన్నీ చూసి ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన సినిమాల ద్వారా తన పాటల ద్వారా మనలోనే మనతోనే ఉన్నారని తృప్తి చెందుదాం.

Tags:    

Similar News