స్టార్ హీరోకి 4 ఏళ్లలో 2 హిట్లు, 12 ఫ్లాపులు!

బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. బ్యాక్ టూ సినిమాలు చేస్తూ, ఏడాది పొడవునా బిజీగా గడుపుతున్నారు.

Update: 2024-07-17 08:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. బ్యాక్ టూ సినిమాలు చేస్తూ, ఏడాది పొడవునా బిజీగా గడుపుతున్నారు. ముప్పై ఏళ్ల సినీ కెరీర్ లో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. కానీ గత కొన్నేళ్లుగా అక్కీకి ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ తర్వాత ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోవడం లేదు. కోట్లు ఖర్చు చేసి తీసిన చిత్రాలు మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోడానికి నానా తంటాలు పడుతున్నాయి.

పాండమిక్ తర్వాత గడిచిన 4 ఏళ్లలో అక్షయ్ కుమార్ నుంచి 14 సినిమాలు వచ్చాయి. వాటిల్లో కేవలం 2 చిత్రాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. మిగతా డజను సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. అక్షయ్ నటించిన 'లక్ష్మీ' చిత్రాన్ని కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైన మొదటి భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రం ఇది. ఇండియాలో థియేటర్లలోకి రానప్పటికీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫిజీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ అయింది. దీనికి విమర్శకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

2021లో అక్షయ్ కుమార్ నుంచి వచ్చిన సినిమా 'బెల్ బాటమ్'. ఇది ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కోవిడ్-19 సెకండ్ వేవ్, వివిధ రాష్ట్రాలలో లాక్డౌన్ కారణంగా ఓపెనింగ్స్ కూడా రాలేదు. 150 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం 50 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన 'సూర్యవంశీ' సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. కానీ వెంటనే ఓటీటీలో రిలీజైన 'అత్రంగి రే' చిత్రానికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదే క్రమంలో అక్షయ్ నటించిన 'బచ్చన్ పాండే', 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'రక్షా బంధన్' వంటి మూడు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. అలానే 'కట్పుట్ల్లి' మూవీ నిరాశ పరచగా.. 'రామసేతు', 'సెల్ఫీ' సినిమాలు ఘోర పరాజయం చవిచూశాయి. ఆ తర్వాత పంకజ్ త్రిపాఠితో కలిసి చేసిన 'OMG 2' చిత్రం సక్సెస్ సాధించింది. కాకపోతే అదే ఏడాది వచ్చిన 'మిషన్ రాణిగంజ్' మూవీ ఫ్లాప్ అయింది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

ఇప్పుడు లేటెస్టుగా 'సర్ఫిరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అక్షయ్ కుమార్. ఇది 'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి హిందీ రీమేక్. హీరో సూర్య నిర్మించిన ఈ సినిమాని ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా అని రివ్యూలు చెప్పినప్పటికీ, కనీస ఓపెనింగ్ కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. సమోసాలు, ఛాయ్ ఫ్రీగా ఇస్తామన్నా జనాలు థియేటర్లకు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయినా సరే అక్షయ్ కుమార్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. 'ఖేల్ ఖేల్ మే', 'స్కై ఫోర్స్', 'జాలీ LLB 3', 'వెల్ కమ్ టూ జంగిల్', 'శంకర', 'హేరా ఫేరి 3' వంటి చిత్రాలలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అలానే 'కన్నప్ప' 'సింగం ఎగైన్' వంటి సినిమాల్లో అతిథి పాత్ర పోషించారు. మరి ఈ చిత్రాలలో అక్కీ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Tags:    

Similar News