ఆలియాకు టాలీవుడ్ నుంచి ఎందుకు ఇంత మద్దతు..!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించిన 'జిగ్రా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-10-11 06:31 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించిన 'జిగ్రా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో రూపొందిన ఈ లేడీ ఓరియంటెడ్‌ యాక్షన్‌ మూవీని తెలుగు లోనూ డబ్‌ చేసి ఇదే రోజు విడుదల చేయడం జరిగింది. హిందీలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కామన్‌గా వస్తూనే ఉంటాయి. కానీ ఈసారి ఆలియా భట్‌ నటించిన సినిమాను ప్రత్యేకంగా తెలుగు లో డబ్‌ చేసి విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. కేవలం తూతు మంత్రంగా డబ్‌ చేసి విడుదల చేయడం కాకుండా స్వయంగా ఆలియా భట్‌ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కోసం హైదరాబాద్‌ రావడం జరిగింది. కనుక జిగ్రా సినిమా పై జనాల్లో ఆసక్తి మొదలు అయింది.

సినిమాను ప్రమోట్‌ చేస్తే ముందస్తు బజ్‌ క్రియేట్‌ అవ్వడం చాలా కామన్‌ విషయం. అయితే ఆలియా భట్‌ నటించిన జిగ్రా సినిమాకు అంతకు మించి అన్నట్లుగా క్రేజ్, బజ్ దక్కింది. అందుకు కారణం సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్స్ లో టాలీవుడ్‌ స్టార్స్ పాల్గొనడం. అంతే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా ఆలియా భట్‌ నటించిన జిగ్రా సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ పోస్ట్‌ లు పెట్టి, ట్రైలర్‌ ను షేర్‌ చేయడం, సినిమా గురించి మాట్లాడటం జరిగింది. అందుకే తెలుగు ప్రేక్షకుల్లో ఆలియా భట్‌ కి అంతంత మాత్రంగానే క్రేజ్ ఉన్నా జిగ్రా సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అయింది అనడంలో సందేహం లేదు.

జిగ్రా సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హాజరు అయ్యారు. ఆయనతో పాటు స్టార్‌ హీరోయిన్ సమంత సైతం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పాల్గొంది. త్రివిక్రమ్‌, సమంత వంటి టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రెటీల హాజరుతో జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి మంచి స్పందన వచ్చింది. సినిమా గురించి ప్రముఖంగా మాట్లాడుకున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సైతం జిగ్రా సినిమా విడుదల సందర్భంగా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేయడం జరిగింది. దాంతో జిగ్రా సినిమా మరింత మందికి చేరువ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆలియా భట్‌ తెలుగు లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయినా టాలీవుడ్‌ తో మంచి బంధం ఏర్పర్చుకుంది. టాలీవుడ్‌ ను ఇతర బాలీవుడ్‌ స్టార్స్ లైట్‌ తీసుకున్నా ఆలియా భట్ మాత్రం ఎప్పుడూ టాలీవుడ్‌ సెలబ్రిటీలతో ముఖ్యంగా స్టార్స్ తో టచ్ లో ఉంటూ స్నేహంగా ఉంటూ వస్తుంది. కనుక ఆమె సినిమా విడుదల సందర్భంగా టాలీవుడ్‌ స్టార్స్ పలువురు తమ వంతు మద్దతు తెలిపారు. ఎన్టీఆర్‌ స్వయంగా ఆమెతో కలిసి ఇంటర్వ్యూ చేసి జిగ్రా సినిమా ప్రమోషన్ లో తన వంతు భాగస్వామ్యం అందించిన విషయం తెల్సిందే. ఇంత మంది ప్రమోషన్‌ తో వచ్చిన జిగ్రా సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన దక్కించుకుంటుంది అనేది చూడాలి.

Tags:    

Similar News