కల్కి 2898ఏడీ.. సీనియర్ ఎన్టీఆర్?

ఇప్పటికి చాలా మంది ఎన్టీఆర్ లోనే రాముడు, కృష్ణుడిని చూసుకుంటారు.

Update: 2024-06-26 07:30 GMT

తెలుగు సినిమా అంటే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. అలాగే దేవుడి పాత్రలు అంటే అందరికి మదిలో మెదిలే రూపం ఎన్టీఆర్. ఆయన సినిమాలు చూసిన తర్వాత భగవంతుడు అంటే ఎలా ఉంటాడో ప్రజలు అర్ధం చేసుకున్నారు. అలాగే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు పాత్రలకి ఎన్టీఆర్ ప్రాణం పోశారని చెప్పాలి. ఇప్పటికి చాలా మంది ఎన్టీఆర్ లోనే రాముడు, కృష్ణుడిని చూసుకుంటారు.

తెలుగు రాష్ట్రాలలో ఆయన విగ్రహాలు చాలా చోట్ల ఉంటాయి. ప్రజలకి కనెక్ట్ కావడం వలన ఎన్టీఆర్ ని కారణజన్ముడుగా తెలుగు ప్రజలు అందరూ భావిస్తారు. ఎన్టీఆర్ మరణాంతరం యమదొంగ సినిమాలో రాజమౌళి సీజీలో సీనియర్ ఎన్టీఆర్ ని తెరపై చూపించి ప్రేక్షకులకి కొత్త అనుభూతి అందించారు. తాత మనవాళ్ళు కలిసి సంభాషించుకున్నట్లు చూపించారు. ఆయనని మరోసారి అందరికి గుర్తుచేశారు.

మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సీనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ చేసిన కల్కి 2898ఏడీ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ ని చూపించబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. ఈ చిత్రంలో కురుక్షేత్ర యుద్ధం నాటి ఎపిసోడ్స్ కొన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఆ ఎపిసోడ్స్ లో శ్రీకృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారనే మాట బలంగా వినిపిస్తోంది.

ఆయన అయితేనే ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి అందించినట్లు అవుతుందని విర్చువల్ గా సీనియర్ ఎన్టీఆర్ ని తెరపై చూపించారంట. అశ్వినీదత్ సీనియర్ ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్. అతని బ్యానర్ లో కూడా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది. ఎన్టీఆర్ కి ట్రిబ్యూట్ గా కల్కి 2898ఏడీ సినిమాలో అతనిని చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

దీనిని సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంచి ప్రేక్షకులకి థ్రిల్ ఫిల్ అందించాలనే ఉద్దేశ్యంతోనే చిత్ర యూనిట్ రివీల్ చేయలేదని టాక్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అశ్వద్ధామ పాత్రని కల్కి చిత్రంలో నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ లుక్ కోసం టెక్నాలజీ ఉపయోగించి అమితాబ్ బచ్చన్ పేస్ లో ఏజ్ తగ్గించి చూపించారు. అలాగే కృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ ని చూపించొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News