తంబీల బాటలోనే బాలీవుడ్ డైరెక్టర్ నటన!
మహారాజా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
చాలామంది స్టార్లు నటుడిగా ఫేడవుట్ అయ్యాక డైరెక్టర్లు అవుతున్నారు. అందుకు పూర్తి భిన్నంగా అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ డైరెక్టర్ ఉన్నట్టుండి నటుడవ్వడం, అక్కడ తనదైన ముద్ర వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అనురాగ్ తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు. `ఇమైక్కా నొడిగల్`తో అతడు నటుడిగా అరంగేట్రం చేసాడు. ఆరంగేట్రమే చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత విజయ్ `లియో`లో కూడా ఒక్క డైలాగ్ కూడా చెప్పాల్సిన పని లేని..కిల్లర్ పాత్రలో కనిపించాడు. ఇటీవల విడుదలైన `మహారాజా` (హిందీ- జునైద్ ఖాన్ హీరో) చిత్రంతో అతడికి బిగ్ బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఇందులో అతడి నటన అందరినీ కట్టి పడేసిందన్న ప్రశంసలు కురిసాయి. మహారాజా చిత్రంలో విజయ్ సేతుపతి పరిమిత పాత్రలో మెరిసినా కానీ అనురాగ్ కశ్యప్ సినిమా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. అనురాగ్ కశ్యప్ మహారాజాలో సెల్వం అనే పాత్రలో నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో అతడి వెంటాడే నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. మహారాజా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
సౌత్ లో చాలామంది ఇలానే:
అనురాగ్ సక్సెసైనట్టే ఇంతకుముందు చాలా మంది దర్శకులు నటులుగాను సక్సెసయ్యారు. సముదిర కని లాంటి పేరున్న దర్శకుడు నటుడిగా, దర్శకుడిగా ట్రావెల్ చేస్తున్నారు. ఇటీవల సౌత్‌లో సహాయకపాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. దర్శకనటులుగాను పలువురు తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఎస్.జె. సూర్య, శశికుమార్, సుందర్ సి, చేరన్, పార్థిబన్ వంటి ప్రముఖ తమిళ దర్శకులు నటులుగాను రాణించారు. ఆల్ రౌండర్ ప్రతిభతో మెప్పించారు. ముఖ్యంగా ఎస్.జె.సూర్య దర్శకుడిగా అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్లు అందించారు పవన్ కల్యాణ్ తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ఎస్.జె.సూర్య, ఇంతకుముందు మహేష్ స్పైడర్ లో క్రూరమైన విలన్ గా నటించి మెప్పించాడు. చాలా మంది అగ్ర హీరోల సినిమాల్లో విలనీ పండించాడు. సుందర్ సి తన సినిమాలకు తాను దర్శకత్వం వహిస్తూనే వాటిలో హీరోగా నటించేస్తున్నాడు. హారర్ జానర్ లో అతడు రాణిస్తున్నాడు. శశికుమార్, చేరన్, పార్ధిబన్ ప్రతిభావంతులైన నటులుగా తమిళ ఇండస్ట్రీలో మెప్పు పొందారు.