‘మెగా’ బాధ్యతలు ఖాయమేనా ?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-07-12 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా గత ఎన్నికల్లో విజయానికి కీలకంగా పనిచేసిన ప్రముఖ హీరో, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంపికయ్యారు. ఇక ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు ప్రముఖ సినీ హీరో, పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

ఒకప్పుడు మద్రాస్ లో ఉన్న సినిమా ఇండస్ట్రీ ఎన్టీఆర్ హయాంలో భారీ ప్రోత్సాహకాలు అందించడంతో క్రమక్రమంగా హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ఇక హైదరాబాద్ లో రాామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో అన్ని భాషల సినిమాలు అక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ తో పాటు విశాఖలో సిని పరిశ్రమ విస్తరణకు కృషిచేసినా అనుకున్నంత మేర అడుగులు ముందుకు పడలేదు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత సినీ పరిశ్రమ పెద్దగా ఉన్న చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించి అమరావతిలో సినీ ప్రముఖుల సహకారంతో ఒక స్టూడియో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు ఆదరణ ఎక్కువ. సినీ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిదే పై చేయిగా ఉంటుంది.

అందుకే ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమకు వారధిగా చిరంజీవి సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి ప్రతిపాదనలను సినీ ప్రముఖులు ఎవరూ తిరస్కరించే పరిస్థితి ఉండదు. ఆయన మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. దాంతో ఏపీలో సినీ పరిశ్రమతో పాటు, ఏపీ ఎదుగుదలకు కూడా అడుగులు పడతాయని అంటున్నారు. గతంలోనే కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా పనిచేసిన చిరంజీవి స్థాయికి తగ్గకుండా ఒక పదవిని అప్పగించి ఏపీ అభివృద్ధిలో ఆయన సేవలు వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.

Tags:    

Similar News