వివాదం.. రెహమాన్ వైపు నిలుస్తున్న స్టార్స్

తాజాగా చెన్నై లో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌ విషయం లో రెహమాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన సంగీతం పరంగా ఎప్పుడు కూడా నెంబర్ వన్

Update: 2023-09-12 09:55 GMT

మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో ఏఆర్ రెహమాన్ ఎన్నో మ్యూజికల్ కాన్సర్ట్ లను నిర్వహించారు. ఎన్నో లైవ్ షో ల్లో లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇండియాలోనే కాకుండా పదుల సంఖ్యల దేశాల్లో రెహమాన్ సంగీత కచేరీలు సాగాయి. ఆయన సినిమా పాటలకు మాత్రమే కాకుండా లైవ్‌ షో లకు కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.

తాజాగా చెన్నై లో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌ విషయం లో రెహమాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన సంగీతం పరంగా ఎప్పుడు కూడా నెంబర్ వన్. కానీ ఈసారి మ్యూజిక్ కాన్సర్ట్‌ నిర్వాహకుల వల్ల రెహమాన్ ను సోషల్ మీడియాలో జనాలు తెగ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తొక్కిసలాట జరగడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి టికెట్లు కొనుగోలు చేసినా కూడా కనీసం ఆడిటోరియం లోకి అడుగు పెట్టలేక పోయిన వారు చాలా మంది ఉన్నారు.

కెపాసిటీ కంటే ఎక్కువ టికెట్లు అమ్మడంతో పాటు సరైన ఏర్పాటు చేయక పోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. అంతే కాకుండా భారీ ఎత్తున జనాలు గుమ్మిగూడటం వల్ల మహిళలపై లైంగిక వేధింపులు కూడా జరిగాయి. వీటన్నింటికి కారణం కార్యక్రమ నిర్వాహకులు మరియు రెహమాన్‌ అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఈ సంఘటనకు రెహమాన్ ను బాధ్యుడిగా చేస్తూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యం లో కోలీవుడ్‌ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా రెహమాన్ కి ఈ విషయం తో సంబంధం ఏంటి, ఆయన్ను ఎందుకు విమర్శిస్తున్నారు అంటూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వారు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు.

హీరో కార్తి ఇప్పటికే రెహమాన్ కు మద్దతుగా నిలిచాడు. ఆయన కచేరికి వెళ్లిన వారిలో నా కుటుంబం కూడా ఉంది. వారు కూడా ఇబ్బంది పడ్డారు. నిర్వాహకుల వల్లే ఆ ఇబ్బంది జరిగింది. రెహమాన్ ఎప్పుడు కూడా తన చుట్టూ ఉన్న వారికి ప్రేమ పంచుతూ ఉంటాడు. ఆయన ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండాలని కోరుకుంటాడు.

నటి ఖుష్బూ మాట్లాడుతూ.. రెహమాన్‌ ఈవెంట్ లో అలాంటి పరిణామం జరగడం దురదృష్టకరం. ఆ సమస్య కు రెహమాన్ ను బాధ్యత వహించమనడం కరెక్ట్‌ కాదు. అభిమానులను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు కార్యక్రమం నిర్వహించడం లో విఫలం అయ్యారు. అందుకే బాధ్యత అంతా కూడా వారే తీసుకోవాలి అన్నారు.

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా ఈ సంఘటన లో రెహమాన్ కు మద్దతుగా నిలిచారు. ఇలాంటి కచేరీలు నిర్వహించడం చాలా కష్టమైన పని. కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం లో తోటి కళాకారుడిగా నేను రెహమాన్ కి మద్దతుగా నిలుస్తున్నాను అన్నాడు.

Tags:    

Similar News