ఆ కథకు పవన్ కరెక్ట్ అని చెప్పిన అజిత్!

Update: 2022-01-09 11:30 GMT
పవన్ కల్యాణ్ తన కెరియర్ ను మొదలుపెడుతూనే గ్యాప్ లేకుండా రెండు హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ఆ అరడజను సినిమాలలో 'తమ్ముడు' ఒకటి. పవన్ కల్యాణ్ స్టార్ డమ్ ను మరింతగా పెంచేసిన సినిమా ఇది. ఈ సినిమాకి రమణ గోగుల సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమణ గోగుల కొత్తగా కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా యూత్ ను ఒక ఊపు ఊపేశాయి. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించాయి. అంతగా ఇవి యూత్ ను ప్రభావితం చేశాయి. 1999లో వచ్చిన ఈ సినిమా, పవన్ కెరియర్లో ఇప్పటికీ ప్రత్యేకమైన స్థానంలోనే కనిపిస్తుంది.

దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఈ సినిమాతోనే తన కెరియర్ ను మొదలుపెట్టాడు. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ .. కన్నడ సినిమాలను కూడా చేశాడు. ఆయన తమ్ముడు కథను ముందుగా వినిపించింది పవన్ కి కాదట .. తమిళ హీరో అజిత్ కి వినిపించాడట. తాజా ఇంటర్వ్యూలో అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ .. 'తమ్ముడు' కథను రెడీ చేసుకున్న తరువాత ఆ కథకి అజిత్ అయితే బాగుంటాడని భావించి ఆయన దగ్గరికి వెళ్లాను. అప్పటికే అజిత్ కి స్టార్ డమ్ వచ్చేసింది. తమిళనాట యూత్ లో ఆయన కి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.

అజిత్ నేను చెప్పిన కథ అంతా విన్నాడు. ఆ తరువాత ఈ కథను తాను చేయడం కంటే, తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తే బాగుంటుందని అన్నాడు. ఆ కథకి .. ఆ పాత్రకి పవన్ బాడీ లాంగ్వేజ్ అయితే కరెక్టుగా సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దాంతో నేను ఆ కథను పట్టుకుని పవన్ ను కలిశాను. కథ వినగానే పవన్ తనకి బాగా నచ్చేసిందని అన్నాడు. ఆ తరువాత ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఒక్క పవన్ కి మాత్రమే కాదు ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరి కెరియర్ గ్రాఫ్ మారిపోయింది.

పవన్ ఆ కథను చేస్తున్నప్పుడు .. ఆ తరువాత వచ్చిన సక్సెస్ చూసిన తరువాత అజిత్ ఎంత కరెక్టుగా చెప్పాడనేది నాకు అర్థమైంది. 'తమ్ముడు' తరువాత నేను కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాకి మాత్రమే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ సినిమాను .. అది ఇచ్చిన సక్సెస్ ను .. అప్పటి జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ అరుణ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. పవన్ సరసన నాయికలుగా ప్రీతీ జింగానియా .. అదితి గోవిత్రికర్ అలరించగా, ముఖ్యమైన పాత్రల్లో బ్రహ్మానందం .. చంద్రమోహన్ .. తనికెళ్ల భరణి .. అచ్యుత్ కనిపిస్తారు.     
Tags:    

Similar News