అరుదైన రికార్డును దక్కించుకున్న 'అఖండ'

Update: 2022-05-25 10:30 GMT
మొదటి నుంచి కూడా బాలకృష్ణకి మాస్ ఇమేజ్ ఎక్కువే. ఆ మాస్ ఇమేజ్ ను ఆయన ఇప్పటివరకూ కాపాడుకుంటూ వచ్చారు. 'మంగమ్మగారి మనవుడు' సినిమాతో సోలో హీరోగా తొలి 100 రోజుల సినిమాను  యన నమోదు చేశారు. ఆ తరువాత ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అప్పట్లో గ్రామీణ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. లారీ డ్రైవర్ నుంచి పోలీస్ ఇన్ స్పెక్టర్ వరకూ ఏ పాత్రను పోషించిన బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. బాలకృష్ణ నుంచి ఒక సినిమా వచ్చిందంటే మినిమమ్ 100 రోజులు ఆడేది.

ఆయన కెరియర్లో సిల్వర్ జూబిలీలు ఆడిన సినిమాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. ఆ జాబితాలో  'మంగమ్మగారి మనవడు'తో పాటు 'ముద్దుల క్రిష్నయ్య' .. 'ముద్దుల మావయ్య' .. ' లారీ డ్రైవర్' .. 'భైరవద్వీపం' .. 'ఆదిత్య 369' .. 'నరసింహా నాయుడు' .. 'సమర సింహారెడ్డి' సినిమాలు కనిపిస్తాయి.

చివరి రెండు సినిమాలు అప్పట్లోనే 20 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ సినిమాలు సిల్వర్ జూబిలీ .. గోల్డెన్ జూబిలీని దాటుకుని డైమండ్  జూబిలీని అందుకోవడం మరో విశేషం. అప్పటివరకూ బాలయ్య - బి.గోపాల్  కాంబినేషన్ గురించి చెప్పుకున్నవారు, ఆ తరువాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్ గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు.

అందుకు కారణం 'సింహా' సినిమాతో ఈ కాంబినేషన్ సంచలనం సృష్టించడమే. పరుచూరి కిరిటీ నిర్మించిన ఈ సినిమాను  చక్రి మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. నయనతార కథానాయికగా అందుకున్న ఈ సినిమా 175 రోజులకి పైగా ప్రదర్శించబడింది. ఇక 'లెజెండ్' సినిమా రాయలసీమ ప్రాంతంలోని 'ఎమ్మిగనూరు'లోని థియేటర్లో 1000 రోజులు ఆడటం ఇప్పటికీ ఒక రికార్డు. ఒక సినిమా  50 రోజులు ఆడటమే గొప్ప అనుకునే సమయంలో ఈ రెండు సినిమాలు ఇంతటి సంచలనాన్ని సృష్టించాయి.

ఇక ఒక సినిమా ఒక వారం థియేటర్లలో నిలబడితే గొప్ప విషయమని అనుకునే సమయంలో 'అఖండ' వచ్చింది. క్రితం ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, 103 థియేటర్లలో 50 రోజులను .. 20  థియేటర్లలో 100 రోజులను పూర్తి చేసుకుంది.

తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటని రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా 175 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. బాలయ్య  - బోయపాటి కాంబినేషన్లో వరుసగా వచ్చిన ఈ మూడు సినిమాలు సిల్వర్ జూబిలీలను అందుకోవడం అరుదైన రికార్డుగానే  చెప్పుకోవాలి .. ఒప్పుకోవాలి.
Tags:    

Similar News