అల్లు శిరీష్‌.. అంత ఉలికిపాటేంటో?

Update: 2018-05-31 14:30 GMT
‘బ్రహ్మోత్సవం’ సినిమాతో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ ను పెట్టి అలాంటి సినిమా తీస్తాడా అని అందరూ అతడిని తిట్టిపోశారు. ఆ సినిమా పరాజయానికి అతడినే పూర్తి బాధ్యుడిని చేశారు. గత కొన్నేళ్లలో ఒక సినిమా వల్ల మరే దర్శకుడికీ ఇంత చెడ్డ పేరు వచ్చి ఉండదేమో. ఆ ప్రభావం అతడి కెరీర్ పై బాగానే పడింది. మహేష్ లాంటి హీరోతో రెండు సినిమాలు చేసిన వాడు.. ఇంకో అవకాశం దక్కించుకోవడానికి రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. చిన్న-మీడియం రేంజి హీరోలు కూడా అతడితో సినిమా చేయడానికి వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ఇక నిర్మాతల సంగతి సరేసరి. ఐతే చివరికి గీతా ఆర్ట్స్ అడ్డాలకు అవకాశమివ్వడానికి ముందుకొచ్చిందని వార్తలొచ్చాయి.

మరి అడ్డాలతో పని చేసే హీరో ఎవరు అన్నపుడు తెరమీదికి వచ్చిన పేర్లలో అల్లు శిరీష్‌ ది కూడా ఉంది. శర్వానంద్ - శ్రీవిష్ణుల పేర్లు కూడా చర్చల్లోకి వచ్చాయి. ఐతే ఇంకా ఎవరూ ఖరారైనట్లుగా కనిపించడం లేదు.

ఐతే నిన్ననే పుట్టిన రోజును జరుపుకున్న శిరీష్‌ ను మీడియా వాళ్లు అడ్డాలతో సినిమా గురించి అడిగితే అతను ఉలిక్కి పడ్డాడు. అదేం లేదు అని ఒక్క మాటలో తేల్చకుండా.. నేనా అడ్డాలతో సినిమా చేయడమా.. నేను ఆయన్ని కలవనే లేదు.. అలాంటి ప్రపోజలే లేదంటూ కొంచెం లెంగ్తీగానే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎక్కడ అడ్డాలతో తనను ముడిపెట్టేస్తారో అన్న కంగారు అతడిలో కనిపించింది. అదే సమయంలో గీతా ఆర్ట్స్‌లో అడ్డాల సినిమా ఉండొచ్చన్న సంకేతాలు కూడా అతనిచ్చాడు. అడ్డాల తీసిన ‘బ్రహ్మోత్సవం’ తేడా కొట్టి ఉండొచ్చు కానీ.. అతడి ప్రతిభను తక్కువ చేయలేం. ‘కొత్త బంగారు లోకం’ -  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మంచి చిత్రాలందించింది అతనే. ఒక సినిమా ఫలితం తేడా వచ్చేసరికి అడ్డాలను చూసి అంతలా భయపడాల్సిన అవసరం లేదు. అతడి మంచి ఆలోచనలున్నాయి. జనాలకు ఏదో మంచి చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఎక్స్‌ ట్రీమ్‌ గా వెళ్లిపోయి దెబ్బ తిన్న అడ్డాల.. కొంచెం తనను తాను నియంత్రించుకుని తొలి రెండు సినిమాల్లాంటి మంచి చిత్రంతో వస్తాడని ఆశిద్దాం.
Tags:    

Similar News