మార్కో.. మధ్యలోనే డ్రాప్ అయిన తెలుగు హీరో!

సినిమా అంటే వినోదానికి మాత్రమే పరిమితం కావాలని భావించే ప్రేక్షకులు ఉన్నట్లే, హింస, సంచలన సన్నివేశాల వల్ల కథ బలపడుతుందని నమ్మే దర్శకులు కూడా ఉంటారు.;

Update: 2025-03-11 04:37 GMT

సినిమా అంటే వినోదానికి మాత్రమే పరిమితం కావాలని భావించే ప్రేక్షకులు ఉన్నట్లే, హింస, సంచలన సన్నివేశాల వల్ల కథ బలపడుతుందని నమ్మే దర్శకులు కూడా ఉంటారు. మలయాళ సినిమా మార్కో కూడా అలాంటి ప్రయత్నమే. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భారీ ఓపెనింగ్స్, 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే, సినిమా హింసా ప్రభావం కారణంగా కొన్ని విమర్శలు ఎదుర్కొంటోంది. థియేటర్‌లో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు టీవీ ప్రసారం నిలిచిపోయింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాను టెలివిజన్‌లో ప్రసారం చేయరాదని కఠిన నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలు, కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా అస్సలు అనుకూలంగా లేదని స్పష్టం చేసింది. CBFC రీజినల్ ఆఫీసర్ నదీమ్ తుఫైల్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ, ఓటీటీలో స్ట్రీమింగ్‌ను కూడా అడ్డుకోవాలని సూచించడం గమనార్హం. సినిమా విడుదలకు ముందు మేకర్స్ దీన్ని 'మోస్ట్ వయలెంట్ మలయాళ మూవీ'గా మార్కెట్ చేయడం వల్లనే ఇప్పుడిది మరింత వివాదాస్పదమైంది.

తాజాగా తెలుగు నటుడు కిరణ్ అబ్బవరం కూడా మార్కో సినిమాపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "నా భార్యతో కలిసి సినిమా చూడడానికి వెళ్లాను. కానీ, సినిమా ద్వితీయార్థంలో హింస దాటికి తట్టుకోలేక మధ్యలోనే బయటకు వచ్చేశాం. అంత రక్తపాతం మేము ఊహించలేదు. ఆమె గర్భవతి కావడంతో సినిమా అసహజంగా అనిపించింది" అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఎంత హింసాత్మకంగా ఉందో కిరణ్ అబ్బవరం మాటల్లోనే అర్థం అవుతోంది.

ఈ అంశంపై హీరో ఉన్ని ముకుందన్ కూడా స్పందించారు. "సమాజంలో ఉన్న హింసతో పోలిస్తే మార్కో సినిమా అందులో 10% కూడా చూపించలేదు" అంటూ సమర్థించుకున్నారు. కానీ, సినిమా చూసిన వారంతా మాత్రం ప్రేక్షకులకు దీని ప్రభావం మరీ తీవ్రంగా పడిందని అభిప్రాయపడుతున్నారు. ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని వర్గాలు దీన్ని ప్రేక్షకులకు రఫ్ యాక్షన్ మూవీగా ప్రమోట్ చేయగా, మరికొందరు మాత్రం ఇది హింసాత్మక మోతాదును దాటిపోయిందని నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.

సినిమా కథ విషయానికి వస్తే, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని నాశనం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకునే యాక్షన్ థ్రిల్లర్. కథ కంటెంట్‌ను బట్టి హింస ఎక్కువగా ఉండటం సహజమే. కానీ, కొన్ని హై ఇంటెన్స్ సన్నివేశాలు కారణంగా కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా అస్సలు అర్థం కాదు. సెన్సార్ బోర్డు కట్‌ చేయించినా, టీవీకి మాత్రం తగదని తేల్చేయడం వల్ల ఛానెల్స్ ఈ సినిమాను ప్రసారం చేయడానికి వెనుకంజ వేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News