‘పుష్ప‌’ సినిమాపై స్పందించిన రంగ‌మ్మ‌త్త‌!

Update: 2021-03-03 02:30 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ‘పుష్ప’. బన్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప.. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో అన‌సూయ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

క్షణం, కథనం వంటి సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు.. ఇప్పుడు సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ‘రంగ‌స్థ‌లం’ లో చేసిన రంగ‌మ్మ‌త్త పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు కూడా దర్శకుడు సుకుమార్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప’ సినిమాలో మంచి పాత్ర ఆఫర్ చేశాడ‌ని ప్ర‌చారంలో ఉంది. అంతేకాదు.. ఇందులో అన‌సూయ హాట్ హాట్ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని అన్నారు. తాజాగా.. ఈ ప్ర‌చారంపై అన‌సూయ స్పందించింది.

‘పుష్ష’ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చేసింది రంగమ్మత్త. ఇప్పటి వ‌ర‌కూ ఆ సినిమాకు సంబంధించిన ప్ర‌తిపాద‌న ఏదీ తన వద్దకు రాలేదని చెప్పింది. అయితే.. నిజంగానే ఆఫర్ వ‌స్తే మాత్రం.. త‌ప్ప‌కుండా చేస్తాని చెప్పింది. అంతేకాదు.. ఆ విష‌యం మీడియాకి కూడా తానే చెబుతానని ప్రకటించింది. దీంతో.. బన్నీ పుష్పతో అనసూయకు ఎలాంటి సంబంధమూ లేదని తేలిపోయింది.

కాగా.. త‌న కెరీర్ గురించి కూడా వివరించింది అనసూయ. తనకు ప్రస్తుతం ఇత‌ర ఇండ‌స్ట్రీల నుంచి కూడా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని తెలిపింది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా త‌న‌ని సంప్ర‌దిస్తున్నార‌ని చెప్పింది అనూ. అయితే.. తాను మాత్రం బుల్లితెర‌ను వ‌దిలి వెళ్లేది లేద‌ని చెప్పుకొచ్చింది. తొలి ప్రాధాన్యం టీవీకే ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. మంచి పాత్ర‌లు వ‌చ్చిన‌ప్పుడే సినిమాల్లో క‌నిపిస్తాన‌ని చెప్పుకొచ్చింది అన‌సూయ‌.
Tags:    

Similar News