గతం నేర్పించని పాఠం!!

Update: 2018-09-30 07:20 GMT
గతమెంత ఘనంగా ఉన్నా ఘోరంగా ఉన్నా మనకది పాఠాలు నేర్పే మార్గదర్శిలా నడిపిస్తునే ఉంటుంది. కాకపోతే మనం దాన్నుంచి ఏం నేర్చుకుంటాం ఏం తీసుకుంటాం అనేది అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు. ఒకప్పుడు అగ్ర నిర్మాతలుగా హీరోలని శాశించిన దిగ్గజాలు ఇప్పుడు నిర్మాణానికి దూరంగా ఏడాదికి ఒకటో రెండో తీయడమే గగనంగా భావిస్తున్న పరిస్థితులు రావడానికి కారణం చరిత్ర నేర్పిన పాఠాలే. సురేష్ లాంటి అగ్ర సంస్థ సైతం వంద సినిమాలకు పైగా చరిత్ర ఉన్నా ఆ తర్వాత వరస పరాజయాలతో దూకుడు తగ్గించేసి పరిమిత సంఖ్యలో సినిమాల నిర్మాణం చేస్తోంది.

కానీ ఇప్పటి నిర్మాతలు మాత్రం వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుండా బడ్జెట్ కు లిమిట్స్ పెట్టుకోకపోవడం వాళ్లనే కాదు కాంబినేషన్లను నమ్ముకుని కోట్లది రూపాయలు పెట్టుబడి పెడుతున్న బయ్యర్లను కూడా నష్టాల పాలు చేస్తోంది. ఇప్పుడు నిర్మాత అనిల్ సుంకర అలాంటి రిస్క్ చేస్తూ హాట్ టాపిక్ గా మారారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమాకు అనిల్ సుంకర నలభై కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారనే వార్త ఇప్పటికే కలకలం రేపుతోంది. హీరోకి అంత స్టేచర్ కానీ మార్కెట్ కానీ లేదని గత సినిమాలు రుజువు చేసినా కూడా ఇంత పెట్టుబడి పెట్టడం అంటే సాహసమే. పైగా ఓపెనింగ్స్ తోనే సగం పెట్టుబడినైనా వెనక్కు తెచ్చే రేంజ్ కు సాయి శ్రీనివాస్ ఇంకా చేరుకొనే లేదు. సాక్ష్యం ఎలాంటి ఫలితాన్ని మూటగట్టుకుందో అందరికి తెలిసిందే.

గతంలో నితిన్ తో లై తీసినప్పుడు అందులో నిర్మాణ భాగస్వామిగా ఉన్న అనిల్ సుంకర దాని వల్ల చేదు అనుభవాన్నే కాక నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. నితిన్ స్థాయికి మించి ఖర్చు పెట్టడమే కారణం. ఇప్పుడు సాయి శ్రీనివాస్ తో కూడా ఇంత భారీ స్కెలు మీద నిర్మిస్తున్న అనిల్ సుంకర నమ్మకం దర్శకుడు తేజ మీదో లేక హీరోనో అర్థం కావడం లేదు. బెల్లం హీరో మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకునే రేంజ్ కి ఇంకా ఎదగలేదు. అలాంటప్పుడు ఇంత సాహసం ఎందుకు చేస్తున్నట్టో.

    

Tags:    

Similar News