అమ్మ చివరి బహుమతి అదే-అనూప్

Update: 2016-02-19 04:11 GMT
అమ్మ.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ఆప్తురాలు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎవ్వరికైనా అత్యంత విషాదకరమైన విషయమే. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇటీవలే ఆ శోకాన్ని అనుభవించాడు. రెండు నెలల కిందట తన తల్లిని కోల్పోయాడు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని బయటి కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు అనూప్.

తాజాగా తాను సంగీతాన్నందించిన ‘పడేసావే’ సినిమా ప్రమోషన్లకు హాజరైన అనూప్.. అక్కడ తన తల్లి జ్నాపకాల్ని నెమరువేసుకున్నాడు. ‘‘మ్యూజిక్ డైరెక్టర్ గా నా కెరీర్ మొదలవ్వక ముందు నుంచి నా జీవితానికి సంబంధించిన ప్రతి విశేషాన్ని, నా ఇంటర్వ్యూలను పొందుపరిచి గత ఏడాది నా పుట్టిన రోజు సందర్భంగా ఒక ఫైల్ బహుమతిగా ఇచ్చింది మా అమ్మ. అది చూసి చాలా చాలా సంతోషించా. కానీ అదే అమ్మ ఇచ్చే చివరి గిఫ్ట్ అవుతుందని అస్సలు ఊహించలేదు’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు అనూప్.

ఇక పడేసావే సినిమా గురించి చెబుతూ.. ‘‘ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమాతో నాగార్జున గారికి సంబంధం ఉంది కాబట్టి నేను మ్యూజిక్ చేయలేదు. 'మనం' సినిమా చేసేటపుడే చునియా గారితో పరిచయమైంది. ఆమె చెప్పిన కథ నచ్చే ఈ సినిమా ఒప్పుకున్నా. మంచి పాటలు ఇవ్వడానికి తగ్గ సందర్భాలు కుదిరాయి. చిన్న సినిమా అని చూడకుండా మంచి మ్యూజిక్ ఇచ్చావంటూ నాగార్జున గారు అభినందించారు. సినిమా కూడా జనాలకు బాగా నచ్చుతుంది’’ అన్నాడు అనూప్.
Tags:    

Similar News