ఏపీ: సినిమా టికెట్ ధరలపై కీలక భేటీ..!

Update: 2022-02-17 06:28 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. సినిమా టికెట్ ధరల క్రమబద్ధీకరణ నిమిత్తం ఏర్పాటైన కమిటీ ఈరోజు గురువారం భేటీ కాబోతోంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11.30 గంటలకు కమిటీ సభ్యులు సమావేశమవుతున్నారు.

భేటీ అనంతరం టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది. ఇప్పటికే టికెట్ రేట్ల ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల సినీ ప్రముఖులు బృందం సలహాలు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న వైయస్ జగన్.. వీటికి అనుగుణంగా నివేదిక రెడీ చేయమని కమిటీని ఆదేశించారని సమాచారం.

జీవో నెం.35 ప్రకారం నిర్ణయించిన నాలుగు ప్రాంతాలుగా కాకుండా మూడు ఏరియాలుగా టికెట్ ధరలు ఉండాలని కమిటీ సిఫార్సు చేసిందని తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ - మున్సిపాలిటీ - నగర పంచాయతీల వారీగా టిక్కెట్ ధరల ఖరారుకు కమిటీ సిఫార్సు చేయనుందని సమాచారం.

ప్రస్తుతమున్న మూడు క్లాసులకు బదులు ఇకపై రెండు క్లాసులు మాత్రమే ఉంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని థియేటర్లలోనూ ఎకానమీ - ప్రీమియం అని రెండే క్లాసులకు కమిటీ సిఫార్సు చేయనుందట. ఎకానమీ కేటగిరిలో 40 శాతం సీట్లు.. 60 శాతం ప్రీమియం కేటగిరి కింద కేటాయించాలని సూచించనున్నారట.

ఏదేమైనా ఏపీలో సినిమా టికెట్ రేట్ల మీద ఈరోజు సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టికెట్ ధరలు ఏమాత్రం పెరుగుతాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజలకు భారం లేకుండా నిర్మాతలకు నష్టం కలగకుండా.. టికెట్ రేట్లు ఉంటాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ఇటీవల టాలీవుడ్ సినీ ప్రముఖులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి - మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - ఆర్. నారాయణమూర్తి - నిరంజన్ రెడ్డి తదితరులు ఇండస్ట్రీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సమావేశం సానుకూలంగా జరిగిందని.. ఈ నెలాఖరులోగా అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. టికెట్ ధరలు పెంచుతూ ఏపీ సర్కారు ఈ వారమే ప్రకటన జారీ చేస్తే వచ్చే.. ఈ నెల 25న విడుదలవుతున్న 'భీమ్లానాయక్' 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' వంటి సినిమాలకు లాభం చేకూరనుంది.
Tags:    

Similar News