'బదాయి దో' ట్రైలర్: స్వలింగ సంపర్కుల కథతో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్..!

Update: 2022-01-25 08:30 GMT
బాలీవుడ్ స్టార్స్ రాజ్‌ కుమార్‌ రావు - భూమి పడ్నేకర్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ''బదాయి దో''. హర్షవర్ధన్‌ కులకర్ణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన జాతీయ అవార్డు విన్నింగ్ సోషల్ కామెడీ డ్రామా 'బదాయి హో' సినిమాకి ఇది స్పిరుచ్వల్ సీక్వెల్‌. ఇది విభిన్నమైన కథతో సరికొత్త పాత్రలతో తెరకెక్కింది.

''బదాయి దో'' చిత్రం వాలెంటైన్స్ వీక్ లో 2022 ఫిబ్రవరి 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు. ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ చిత్రం స్వలింగ సంపర్కానికి సంబంధించిన కథతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది.

రాజ్‌ కుమార్‌ రావు ఇందులో మహిళా పోలీస్ స్టేషన్‌ లో పనిచేసే ఏకైక పురుష పోలీసు అధికారి శార్దూల్ ఠాకూర్ అనే పాత్రలో నటించారు. మరోవైపు సమన్ అనే ఒక పీఈటీ టీచర్‌ పాత్రలో భూమి పడ్నేకర్ కనువిందు చేస్తోంది. అయితే వీరికి 30 ఏళ్లు పైబడటంతో పెళ్లి చేసుకోవాలని పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ కుటుంబాలను సంతృప్తి పరచడం కోసం శార్దూల్ - సమన్ పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే శార్దూల్‌ కి మగవారిపై ఆసక్తి ఉంటే.. సమన్‌ కు తన స్నేహితురాలితో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. పెళ్లి తర్వాత వారి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది ''బదాయి దో'' సినిమాలో చూపించబోతున్నారు.

ట్రైలర్ ఆద్యంతం ఫన్నీగా అలరిస్తోంది. రాజ్‌ కుమార్‌ రావు - భూమి పడ్నేకర్ ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 'బదాయి హో' కి సహ రచయితలుగా పని చేసిన సుమన్‌ అధికారి - అక్షత్‌ గిల్డియాల్ ఈ చిత్రానికి కథను అందించారు. అమిత్ తివారి - అంకిత్ తివారి - తనీష్ బాగ్చి సంగీతం సమకూర్చారు.

''బదాయి దో'' చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై వినీత్ జైన్ నిర్మించారు. కరోనా నేపథ్యంలో బాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. మరి ఇప్పుడు 'హంటర్' ఫేమ్ హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో సోషల్ మెసేజ్‌ తో తెరకెక్కిన ఈ హాస్యభరితమైన ''బదాయి దో'' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.






Full View

Tags:    

Similar News