వంద కోసం బాలయ్య తొందర పడ్డాడా?

Update: 2016-01-19 08:52 GMT
తన వందో సినిమాని సింగీతం శ్రీనివాసరావుతో చేస్తున్నట్లు ప్రకటించి, నందమూరి బాలకృష్ణ పెద్ద షాకే ఇచ్చారు. ఇప్పటి వరకూ బాలయ్య వందో సినిమాకి డైరెక్టర్ బోయపాటి శ్రీనునే అని ఫిక్స్ అయిన అభిమానులు అందరికీ బాలకృష్ణ నిర్ణయం షాక్ కలిగించింది. సింహ - లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడిని కాకుండా.. ఇలా పాత తరం డైరెక్టర్ ని ఎంచుకోవడం కొంత ఆందోళన కూడా  కలిగించిన మాట వాస్తవమే.

నిజానికి తన వందో సినిమా ఆఫర్ మొదట బోయపాటికే ఇచ్చాడు బాలయ్య. స్క్రిప్ట్ రెడీ చేసుకోమని చెప్పాడు కూడా. 99వ సినిమా తర్వాత వీలైనంత త్వరగా రెడీ చేసేయాలన్నది ఆయన ఐడియా. ప్రస్తుతం బోయపాటి బన్నీ సరైనోడుతో ఫుల్లు బిజీగా ఉన్నాడు. బోయపాటికి బాలయ్య ఇచ్చిన టైం.. మార్చ్ వరకే. ఇంత తక్కువ టైంలో కంప్లీట్ గా స్క్రిప్ట్ సిద్ధం కాదని చెప్పేయడంతో.. బాలయ్య సింగీతం వైపే మొగ్గారు. అసలు ఆదిత్య 369కి సీక్వెల్ చేయాలనే ఆలోచన బాలయ్యకు ఎప్పటి నుంచో ఉంది. సింగీతం కూడా పక్కా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఇలాంటి సినిమాలో ఇంకా స్టోరీ సిటింగ్ లు మొదలు కూడా పెట్టని బోయపాటి కంటే, సింగీతంతో వెళ్లడమే కరెక్ట్ అని బాలయ్య భావిస్తున్నాడని అంటున్నారు. అయితే, వరుస హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కోసం కొంత గ్యాప్ తీసుకుంటే బాగుండేదని అభిమానుల ఆలోచన.

ఇదిలా ఉంటే.. 2016లోనే నందమూరి వారసుడు మోక్షజ్ఞను లాంఛ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ అవకాశం బోయపాటికే ఇస్తూ.. తన కొడుకు అరంగేట్ర మూవీ చేయాల్సిందిగా బాలయ్య ఆఫర్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు బాలయ్య వందో సినిమా ఆఫర్ ను బోయపాటి వదులుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News