బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్లను తానేం చేశానో చెప్పి షాకిచ్చిన పింకీ

Update: 2021-12-06 03:53 GMT
అంచనాలు నిజమయ్యాయి. షోకు రెండు రోజుల ముందే బయటకొచ్చిన లీకులకు తగ్గట్లే తుది ఫలితం ఏర్పడింది. ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియనున్న వేళ.. టాప్ 5లో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన పింకీ.. ఎట్టకేలకు బయటకురావాల్సి వచ్చింది. ఆమె బయటకు వచ్చినంతనే చోటు చేసుకున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ సీజన్ లో మొత్తం 19 మందికి గాను ఇప్పటికి పదమూడు మంది బయటకురాగా.. హౌస్ లో ఇంకా ఆరుగురు ఉన్నారు. వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయితే.. మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు బయటకు వచ్చిన వారిలో యాంకర్ రవి కంటే కూడా భారీ ఎత్తున అభిమానులు.. స్నేహితులు వెల్ కం చెప్పింది ప్రియాంకకే. ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చినట్లుగా ప్రకటించిన కాసేపటికే హోటల్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. బంజారాహిల్స్ లోని రేడియెన్సీ రెసిడెన్సీలోని తన నివాసానికి చేరుకున్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన డీజే.. తీన్మార్ స్టెప్పులతో సందడి సందడి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా పింకీ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. ఆమెకు వెల్ కం చెప్పేందుకు జెస్సీ వచ్చారు. వారిద్దరూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మీడియా.. పింకీ ఎలిమినేట్ అవుతుందని ఊహించారా? అంటే అవునని ఓపెన్ అయిన జెస్సీ మాటలకు రియాక్టు అయిన పింకీ.. ‘నువ్వు అలా చెప్పకూడదు కదా?’ అంటూ వ్యాఖ్యానించింది. అయినప్పటికీ జెస్సీ మాత్రం నిజాలే చెబుతానన్న రీతిలో ఆటలో తాను చెప్పిన సలహాలు పాటించలేదని.. అందుకే ముందే వచ్చేసిందని చెప్పాడు.

తన కెప్టెన్సీ సమయంలో పింకీ అస్సలు మాట వినేది కాదని.. మైకు కూడా పెట్టుకునేది కాదని జెస్సీ కంప్లైంట్ చేశాడు. దీనికి స్పందించిన ప్రియాంక.. తాను అందరు కెప్టెన్లకు టార్చర్ పెట్టానని.. చివరకు రవి అన్నయ్యతో సహా అంటూ వ్యాఖ్యానించింది. చాలా సార్లు మైకు పెట్టుకునేదానిని కాదని.. జెస్సీ కెప్టెన్ గా ఉన్నప్పుడు.. అతడి మాట వినేదాన్ని కాదని.. ఏం చేసుకుంటావ్ అనేదాన్నని.. అయినా తనకు మాత్రం ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదంటూ ఇంట్లో తాను చేసిన పనుల్ని చెప్పి షాకిచ్చింది.

బిగ్ బాస్ షోలో సాఫ్ట్ గా.. ఏదైనా నిర్ణయాన్ని చెప్పాలన్న వేళ.. సేఫ్ గేమ్ అడే పింకీలో ఇంత అల్లరి అమ్మాయి ఉందా? అన్న రీతిలో ఆమె తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తనకు వెల్ కం చెప్పేందుకు వచ్చిన జెస్సీ నుదిటి మీద ముద్దు పెట్టి.. చిన్నపాటి హగ్ ఇచ్చి బై చెప్పింది. తాజాగా ఎలిమినేషన్ తో బాధతో బయటకు వచ్చిన ప్రియాంకకు అంతకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చేలా స్నేహితులు.. అభిమానులు సాదరంగా స్వాగతం పలకటం ఆమెకు భారీ ఊరటగా మారిందని చెప్పక తప్పదు.

Full View
Tags:    

Similar News