ఫిలింన‌గ‌ర్- కృష్ణాన‌గ‌ర్ లో ఇలాంటి పోస్ట‌ర్ చూడ‌లేమా?

Update: 2023-01-03 04:12 GMT
మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలో ఫీమేల్ డామినేష‌న్ పాజిబులేనా? అంటే సాధ్య‌మేన‌ని నిరూపించిన క‌థానాయిక‌లు కొంద‌రు ఉన్నారు. న‌య‌న‌తార‌- అనుష్క‌- నిత్యామీన‌న్- స‌మంత‌- సాయిప‌ల్ల‌వి లాంటి అరుదైన ప్ర‌తిభావంతులు దీనిని నిరూపించారు. బాలీవుడ్ లో దీపిక ప‌దుకొనే- క‌త్రిన- కంగ‌న‌ లాంటి నాయిక‌లు యాక్ష‌న్ క్వీన్స్ గా నిరూపిస్తున్నారు.

ఇటీవ‌లి రిలీజ్ ల‌ను ప‌రిశీలిస్తే త‌లైవి నయనతార 'కనెక్ట్' నాయికా ప్రాధాన్యంతో విడుద‌లైన సినిమా. న‌య‌న్ ప‌వ‌ర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ గురించి చ‌ర్చించుకునేలా చేయ‌గ‌లిగింది. బాక్సాఫీస్ వ‌ద్ద జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా నాయికా ప్ర‌ధాన సినిమాల్లో న‌య‌న‌తార న‌టిస్తోంది. అరుంధ‌తి-భాగ‌మ‌తి- పంఛాక్ష‌రి లాంటి చిత్రాల‌తో అనుష్క ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాలు అందుకుందో తెలిసిందే. ఇటీవ‌ల స్వీటీ స్పీడ్ త‌గ్గినా తిరిగి కంబ్యాక్ లో అద‌ర‌గొట్ట‌బోతోంద‌న్న టాక్ ఉంది. అలా మొద‌లైంది మొద‌లు ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి నిత్యామీన‌న్ ప్ర‌ధాన అస్సెట్ గా నిలిచింది. న‌టించిన ప్ర‌తి సినిమాలో హీరో కంటే నిత్యానే హైలైట్ అయ్యేది.

ఇక సాయిప‌ల్ల‌వి ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి త‌నే ప్ల‌స్. త‌న‌కోస‌మే క‌థ‌లు రాసే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఉన్నారు. క‌మ్ముల 'ల‌వ్  స్టోరి' విజ‌యంలో సాయిప‌ల్ల‌వి కీలకం అన్న చ‌ర్చ సాగింది. మ‌జిలీ- ఓ బేబి లాంటి నాయికా ప్ర‌ధాన కంటెంట్ ఉన్న సినిమాల్లో స‌మంత అద్భుతంగా న‌టించింది. మ‌జిలీలో ముక్కోణ ప్రేమ‌క‌థ సాగుతున్నా స‌మంత - చై ల‌వ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ఆ మూవీలో విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ముగిసిన‌ ఏడాది(2022) వ‌ర‌కూ  చూస్తే.. న‌య‌న‌తార క‌థానాయిక‌గా అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ 'కనెక్ట్' డిసెంబర్ 22న విడుదలైంది. ఇందులో న‌య‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ నటించిన 'డ్రైవర్ జమున' డిసెంబర్ 30న విడుదలైంది. ఈ రెండు సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యాయి.

డిసెంబర్ 30న తమిళంలో త్రిష నటించిన రాంగీ... కోవై సరళ నటించిన 'సెంబి' చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో కోవై సరళ సినిమా డామినేట్ చేసింద‌న్న టాక్ వినిపించింది.

ఇక‌పోతే చెన్నైలో ఆ న‌లుగురు మ‌హిళా న‌టీమ‌ణుల సినిమా పోస్ట‌ర్ల‌ను ఒకేచోట వీక్షించే అవ‌కాశం అభిమానుల‌కు క‌లిగింది. నెమ్మ‌దిగా ఆడాళ్లూ జోహార్లు అనిపించేలా త‌మిళ తంబీల ఆరాధ‌న‌తో త‌మిళంలో నాయికా ప్ర‌ధాన సినిమాల జోరు పెరుగుతుంద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాలి.

మేల్ డామినేష‌న్ అధికంగా ఉండే టాలీవుడ్ లో నాయికా ప్ర‌ధాన సినిమాల సంఖ్య ఇప్పుడు జీరోకి ప‌డిపోయింది. స్టార్ హీరోయిన్ అనుష్క జోరు త‌గ్గిపోయింది. న‌య‌న‌తార డ‌బ్బింగుల‌తోనే ఇక్క‌డికి వ‌స్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి త‌ర్వాత ఏ ప్ర‌య‌త్నమూ చేయ‌డం లేదు. త్రిష‌కు టాలీవుడ్ ఎందుక‌నో గ్రాండ్ వెల్ కం చెప్ప‌డం లేదు. త‌మ‌న్నా గ్లామ‌ర‌స్ కోణంలోనే క‌నిపిస్తుంది ఎంత చూసినా. కీర్తి సురేష్ ట్రై చేసి ఫెయిలైంది. కేవ‌లం సాయిప‌ల్ల‌వి మాత్ర‌మే టాలీవుడ్ లో నాయికా ప్ర‌ధాన సినిమాలతో అప్పుడ‌ప్పుడు మెరిపిస్తోంది. ఫిలింన‌గ‌ర్- కృష్ణాన‌గ‌ర్ లో చెన్నై త‌ర‌హా పోస్ట‌ర్ చూడ‌డం ఇప్పటికి ఇంకా సాధ్యం కాదు! ఇక్క‌డా ప‌రిస్థితులు మారాల‌ని కోరుకుందాం. హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్- కృష్ణాన‌గ‌ర్ లో ఇలాంటి పోస్ట‌ర్ చూడ‌గ‌ల‌మ‌నే ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News