డిజిట‌ల్ అశ్లీల‌త‌కు సెన్సార్ బ్రేక్

Update: 2019-09-05 01:30 GMT
సృజ‌నాత్మ‌క‌త‌ను ప్రూవ్ చేసుకునేందుకు యూట్యూబ్ స‌హా డిజిట‌ల్ వేదికలు అన్నిర‌కాలుగా ఔత్సాహిక క్రియేట‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఉచితంగా స్పేస్ ల‌భిస్తుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ క్రియేటివిటీ పేరుతో రెచ్చిపోతున్నారు. అయితే ఇక‌పై డిజిట‌ల్ కంటెంట్ ని ఇష్టానుసారం చూపిస్తామంటే కుద‌ర‌దు. త్వ‌ర‌లోనే సెన్సార్ షిప్ కి మార్గ‌ద‌ర్శ‌కాల్ని విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు స‌మాచార ప్ర‌సారాల‌ శాఖ సీరియస్ గా క‌స‌ర‌త్తు చేస్తోంద‌ట‌.

ప‌లువురు ఓటీటీ (ఓవ‌ర్ ది టాప్) ప్లాట్ ఫామ్స్ కి చెందిన ప్ర‌ముఖుల్ని ఆహ్వానించి డిజిట‌ల్ కంటెంట్ స‌న్సార్ పై నియ‌మ‌నిబంధ‌న‌ల్ని త‌యారు చేయాల్సిందిగా స‌ద‌రు మంత్రిత్వ‌ శాఖ కోరింది. ఇక‌పై డిజిట‌ల్ అనేది స్వేచ్ఛా మాధ్య‌మం కాదు. సెన్సార్ త‌ప్ప‌నిస‌రి చేయాల్సిందేన‌ని భావిస్తున్నారు. యూట్యూబ్ - వెబ్ టీవీ- స్మార్ట్ టీవీ- ఆండ్రాయిడ్- గూగుల్ టీవీ- యాపిల్ టీవీ- గేమింగ్ క‌న్సోల్స్- మొబైల్ టీవీ.. ఇలా ఇంట‌ర్నెట్ ఆధారిత స‌ర్వీసుల‌న్నీ ఓటీటీ ప‌రిధికి వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

స‌మాచార ప్ర‌సారాల శాఖ ఇంత స‌డెన్ గా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే.. ఇటీవ‌లే నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌సారం అయిన `లీలా` షో తెచ్చిన తంటానే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. దీనిపై మ‌త‌ప‌ర‌మైన వివాదాలు త‌లెత్తాయి. ఆ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం రియ‌లైజ్ అయ్యి డిజిట‌ల్ పై సీరియ‌స్ గా ఆలోచిస్తోంది. ఒక్క నెట్ ఫ్లిక్స్ సిరీస్ మాత్ర‌మే కాదు.. దేశ‌వ్యాప్తంగా పాపుల‌రైన డిజిట‌ల్ మాధ్య‌మాల‌న్నిటిపైనా ఇక‌పై సెన్సార్ నిబంధ‌న‌ల్ని అమ‌లు చేస్తార‌ట‌. నెట్ ఫ్లిక్స్- అమెజాన్- హాట్ స్టార్ స‌హా ప‌లు డిజిట‌ల్ వేదిక‌లు వెబ్ సిరీస్ ల‌ను అందిస్తున్నాయి. ఈ కంటెంట్ ని పూర్తి స్థాయి సెన్సార్ చేశాకే ఎయిర్ చేయాల్సి ఉంటుంది. డిజిట‌ల్ లో సెన్సార్ నిబంధ‌న‌లు బూతు కంటెంట్ ని త‌గ్గిస్తాయ‌న్న అంచ‌నా ఉన్నా సృజ‌నాత్మ‌క‌తకు అడ్డు క‌ట్ట ప‌డే నిబంధ‌న అవుతుంద‌ని భ‌య‌ప‌డేవాళ్లు ఉన్నారు.
Tags:    

Similar News