అంత టాలెంట్ చూపిస్తే..రీమేక్ ఛాన్సా?

Update: 2015-08-05 16:22 GMT
చందూ మొండేటి.. టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన యువ దర్శక తరంగం. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ దశ దిశ మార్చేసిన కొన్ని సినిమాల్లో అతను తీసిన ‘కార్తికేయ’ కూడా ఒకటి. సినిమాలో విషయం ఉండాలే కానీ.. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసేస్తుందో కార్తికేయ రుజువు చేసింది. ఆ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు చందూ మొండేటి. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున చందూను లాక్ చేసేశాడు. చందూ దగ్గర నాగ్, నాగచైతన్యలిద్దరి కోసం కథలున్నా.. కొడుకుకే చందూను అటాచ్ చేశాడు నాగ్. ఆర్నెల్ల కిందటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఓకే అయింది.

కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ గా తమన్నాను ఫిక్స్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. ఐతే ‘దోచేయ్’ నిరాశ పరచడంతో ఇప్పుడు చైతూ ఆలోచన మారినట్లు కనిపిస్తోంది. చందూ తో చేయాల్సిన సినిమా ప్రయోగాత్మక కాన్సెప్ట్ కావడంతో అది కాస్త వాయిదా వేద్దామా అన్న ఆలోచనలో పడ్డట్లు చెబుతున్నారు. అలాగని చందూ నేమీ పక్కనబెట్టట్లేదు. అతడి టాలెంట్ మీద నాగ్ కు అపారమైన నమ్మకముంది. అందుకే ‘ప్రేమమ్’ రీమేక్ అతడి చేతుల్లో పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో ప్రేమమ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై చైతూ బాగా మనసుపడ్డాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మారిస్తే తనకు మెమొరబుల్ మూవీ అవుతుందని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి చందూకు ప్రేమమ్ రీమేక్ బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఐతే కార్తికేయ తో అంత టాలెంట్ చూపించిన చందూను రీమేక్ సినిమా చేయమనడం కరెక్టా అన్నదే సందేహం
Tags:    

Similar News