నాని కొత్త ప్రాజెక్టులు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆగిపోతున్నాయేంటీ?

తాజాగా ఆయన ఓ కొత్త సినిమా కమిట్ అయినప్పటికీ, చివరికి ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.;

Update: 2025-03-11 05:04 GMT

టాలీవుడ్‌లో కన్‌సిస్టెంట్ స్టార్‌గా కొనసాగుతున్న నేచురల్ స్టార్ నాని, ప్రతి సినిమా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. వంటి వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న నాని, ఇప్పుడు తన ప్రాజెక్టుల విషయంలో కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన ఓ కొత్త సినిమా కమిట్ అయినప్పటికీ, చివరికి ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ‘హిట్: ది థర్డ్ కేస్’ షూటింగ్ పూర్తి చేసుకున్న నాని, మే 1న సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే, దాని తరువాత ఏ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనే అంశంలో కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. నాని ఇటీవల ప్రకటించిన ‘ది ప్యారడైస్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కేవలం ఫస్ట్ లుక్ కి సంబంధించిన టెస్ట్ షూట్ మాత్రమే జరిగింది. అందులో భాగంగానే ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు.

ఈ ప్రాజెక్ట్‌ కోసం భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది. మరోవైపు, నాని సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, పవన్ కళ్యాణ్ OG పూర్తయేవరకు ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవ్వడం ఖాయం. దీంతో నాని తన తదుపరి ప్రాజెక్టుగా తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

అయితే, ఇది అనుకున్నంత సులభం కాలేదు. సిబి చక్రవర్తి డాన్ చిత్రంతో బిగ్ హిట్ కొట్టి, తమిళ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అదే సమయంలో, తమిళ నిర్మాతల నుండి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. కానీ, తన తర్వాతి సినిమా కోసం హీరో దొరకకపోవడంతో కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయడంలో చాలా టైమ్ తీసుకున్నాడు. ఇప్పుడు తెలుగులో నాని సినిమా చేసేందుకు రెడీ అయినప్పుడు, తమిళ నిర్మాతలు ఆయనపై ఒత్తిడి పెంచారు. ముందుగా తీసుకున్న అడ్వాన్సులను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తే ఫైనాన్షియల్‌గా సమస్యలు వస్తాయని నాని, మైత్రి మూవీ మేకర్స్ అనుకున్నారు. ఫలితంగా ఈ ప్రాజెక్ట్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికైతే నాని మరో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ‘ది ప్యారడైస్’ సెట్స్ పైకి వెళ్లేంత వరకు నాని తన ఇతర కమిట్మెంట్స్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. ముఖ్యంగా, ‘కోర్ట్’ అనే ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ‘హిట్ 3’ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నాడు.

ఈ గ్యాప్‌లో నాని కొత్త కథలు వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన కెరీర్‌లో ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న నాని, కొత్త దర్శకులతో కలిసి వర్క్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని టాక్. కానీ, ఒకేసారి ప్రాజెక్టులు వాయిదా పడడం వల్ల ఈ బ్రేక్ అతనికి నిత్యం బిజీగా ఉండే జీవితంలో కాస్త రిలాక్స్ చేసే అవకాశం కల్పించిందనుకోవాలి. నాని లైనప్‌కి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News