విశ్వంభర : అప్పుడు చరణ్‌, ఇప్పుడు పవన్‌!

శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

Update: 2025-03-11 05:05 GMT

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. కానీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి ఎక్కువ సమయం పడుతున్నట్లు సమాచారం అందుతోంది. మొదట 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ షూటింగ్‌ పూర్తి కాలేదని సంక్రాంతి బరి నుంచి విశ్వంభర సినిమాను తొలగించిన విషయం తెల్సిందే. విశ్వంభర తప్పుకోవడంతో సంక్రాంతి బరిలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన గేమ్‌ ఛేంజర్‌తో నిలిచాడు. శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద గేమ్‌ ఛేంజర్‌ అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంభర సినిమాను సమ్మర్‌ 2025లో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. నిన్న మొన్నటి వరకు మే 9, 2025న విశ్వంభర వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ వీఎఫ్‌ఎక్స్ విషయంలో రాజీ పడటం లేదని, అందుకే ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర సినిమాను దసరా సీజన్‌లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని, మే 9న విడుదల అసాధ్యం అంటూ తేలిపోయింది. చిరంజీవికి చాలా కీలకమైన, సెంటిమెంట్‌ డేట్‌ మే 9న విశ్వంభర విడుదల చేయాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాదని తేలిపోవడంతో ఆ తేదీకి వీరమల్లు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమాను మొన్నటి వరకు మార్చి 28న విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండటంతో, పవన్‌ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల విడుదల వాయిదా అని తేలిపోయింది. వీరమల్లు వచ్చే నెల షూటింగ్‌ పూర్తి చేయనున్నారు. కీలకమైన రాజస్థాన్‌ షెడ్యూల్‌ను వచ్చే నెలలో ప్లాన్‌ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. దాంతో షూటింగ్‌ పూర్తి కానున్నట్లు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే నెలోల సినిమా షూటింగ్‌ పూర్తి అయితే మే 9న విడుదలకు ఇబ్బంది ఏమీ ఉండదని, కనుక హరి హర వీరమల్లు మేకర్స్ వచ్చే నెలలో డేట్ల కోసం పవన్‌ను రిక్వెస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్‌కి డేట్లు ఇచ్చే విధంగా మొదట ప్లాన్‌ చేశారు. కానీ వీలు పడటం లేదని, వచ్చే నెలలో కచ్చితంగా డేట్లు ఇచ్చే విధంగా పవన్‌ నుంచి హామీ వచ్చినట్లు మేకర్స్ చెబుతున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాను రెండు పార్ట్‌లుగా రూపొందిస్తున్న విషయం తెల్సిందే. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయి దాదాపుగా నాలుగు ఏళ్లు అవుతుంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ఇటీవల ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల వీరమల్లు షూటింగ్‌ నత్త నడకన సాగుతుంది. మే 9న అయినా వీరమల్లు వచ్చేనా అనేది చూడాలి.

Tags:    

Similar News