చరణ్ మంచి మనసుకి ఇదో నిదర్శనం!

Update: 2022-04-12 08:30 GMT
మెగాస్టార్ వారసుడిగా చరణ్ ఇండస్ట్రీకి వచ్చారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను సెట్ చేసుకుని, తండ్రికి తగిన కొడుకు అనిపించుకుంటూ ముందుకు వెళుతున్నారు. హీరోగా తెరపై దానధర్మాలు చేయడం మాత్రమే కాదు, నిజజీవితంలోను అదే స్థాయిలో స్పందించడం చరణ్ కి అలవాటు. తప్పసరి పరిస్థితుల్లో ఆయన సాయం కోసం వెళ్లినవారు ఉత్తచేతులతో తిరిగి రారని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా కష్టం చెప్పుకుంటే చిరంజీవి మనసు వెంటనే కరిగిపోతుంది. అదే లక్షణం చరణ్ కి వచ్చిందని అంటూ ఉంటారు.

గతంలో జానీ మాస్టర్ బిడ్డకి ఏదో అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు, చరణ్ వెంటనే స్పందించి అందుకు అవసరమైన ఖర్చు మొత్తాన్ని తాను భరించారు. ఇలా ఎంతోమందికి చరణ్ తన సహాయ సహకారాలను అందిస్తూ వెళుతున్నారు.

అయితే ఈ విషయాలను గురించి ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గరా ప్రస్తావించరు. 'మనం సైతం' నిర్వాహకుడు కాదంబరి కిరణ్ కుమార్, చరణ్ చేసిన ఒక సాయాన్ని గురించి తాజాగా ఒక విషయాన్ని బయటికి చెప్పారు. "కొంతకాలం క్రితం ఒక అసిస్టెంట్ భార్య చనిపోయింది. బిల్లు కట్టేసి శవాన్ని తీసుకుని వెళ్లమని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. అతని దగ్గర అంత  డబ్బులేదు.

సుకుమార్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న చరణ్, వెంటనే ఆ వ్యక్తికి 2 లక్షల రూపాయల సాయం చేశారు. ఆ డబ్బుతో 'మనం సైతం'  ఫౌండేషన్  ద్వారా అన్ని కార్యక్రమాలను పూర్తి చేశాము. చనిపోయిన  ఆమెకి 18 నెలల పాప ఉంది. ఆ పాప పేరుతో కొంత ఫిక్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అందుకు సుకుమార్ తదితరులు తలో చేయి వేయడం జరిగింది. అలా ఆ పాప భవిష్యత్తు గురించిన ఆలోచన చేయడం జరిగిపోయింది. రీసెంట్ గా ఒక సందర్భంలో నేను చరణ్ గారికి తారసపడ్డాను. అప్పుడు  చరణ్ గారు' ఆ పాప ఎలా ఉంది? ఏం చేస్తుంది? అని అడిగారు.

చరణ్ గారు ఆ ఆ పాపను గుర్తుపెట్టుకుని అడగడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఏదో ఆ రోజున సాయం చేశాం ..  అయిపోయింది  అనుకోకుండా ఆయన అలా గుర్తుపెట్టుకుని అడగడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. బంగారు చెంచాతో పుట్టడం వేరు .. బంగారం వంటి మనసుతో బ్రతకడం వేరు.

అలాంటి ఒక మంచి మనసున్న వ్యక్తి చరణ్. అందరి దృష్టికి ఆయన ఒక స్టార్ హీరోలా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ నాకు మాత్రం ఆయన ఒక మంచి మనసున్న మనిషిగా .. మానవత్వం కలిగిన గొప్ప మనిషిలా కనిపిస్తూ ఉంటారు" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News