సినిమా రివ్యూ : చీకటి రాజ్యం

Update: 2015-11-20 07:30 GMT
చిత్రం -  చీకటి రాజ్యం

నటీనటులు- కమల్ హాసన్ - త్రిష - ప్రకాష్ రాజ్ - కిషోర్ - సంపత్ రాజ్ - యుగి సేతు - మధు శాలిని - ఆశా శరత్ తదితరులు
సంగీతం- జిబ్రాన్
ఛాయాగ్రహణం- సాను జాన్ వర్గీస్
మాటలు- అబ్బూరి రవి
నిర్మాతలు- కమల్ హాసన్ - చంద్ర హాసన్
స్క్రీన్ ప్లే- కమల్ హాసన్
దర్శకత్వం- రాజేష్ ఎం.సెల్వ

కమల్ హాసన్ సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ ప్రేక్షకులకు ఏదో కొత్తదనాన్ని అందించాలనే ఆయన తపన మాత్రం ప్రతి సినిమాలో కనిపిస్తుంది. విశ్వరూపం, ఉత్తమ విలన్ సినిమాల్లో ఆ కొత్తదనం ఆయన అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడాయన ఇంకో కొత్త సినిమాతో ముందుకొచ్చారు. అదే.. చీకటి రాజ్యం. తమిళంలో పాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రం.. తమిళం కంటే పది రోజులు ఆలస్యంగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఇందులోనూ కమల్ తన ముద్ర చూపించారా? మాంచి థ్రిల్లర్ చూపిస్తానన్న ప్రామిస్ నిలబెట్టుకున్నాడా? చూద్దాం పదండి.

కథ:

దివాకర్ (కమల్ హాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పని చేసే అధికారి. తన డిపార్ట్ మెంట్ లోనే పని చేసే మణి (యుగి సేతు)తో కలిసి ఓ గ్యాంగ్ నుంచి దౌర్జన్యంగా కొకైన్ ఎత్తుకెళ్తాడు. ఐతే ఆ కొకైన్ యజమాని అయిన విఠల్ రావు (ప్రకాష్ రాజ్).. దివాకర్ కొడుకు వాసు (అమన్ అబ్దుల్లా)ను కిడ్నాప్ చేసి.. తన సరకు తెచ్చి ఇచ్చి కొడుకును తీసుకెళ్లమంటాడు. దీంతో ఆ సరకు తీసుకుని విఠల్ రావు నడిపే నైట్ క్లబ్బుకి వెళ్తాడు దివాకర్. మరి అక్కడ అతడికెదురైన ఇబ్బందులేంటి? తన కొడుకుని అతనెలా కాపాడుకున్నాడు? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

చీకటి రాజ్యం.. ‘స్లీప్ లెస్ నైట్’ అనే ఫ్రెంచ్ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని కమలే స్వయంగా వెల్లడించాడు. ఐతే ఆ కథలోంచి ఏం తీసుకున్నారు? ఏం మార్పులు చేశారో అన్న సంగతి తెలియదు కానీ.. ‘చీకటి రాజ్యం’ మనం ఈజీగా కనెక్టయ్యే థ్రిల్లరే. ఉత్కంఠతో ఊపేసేంత థ్రిల్ ఇందులో లేదు కానీ.. రెండు గంటల పాటు ఎంగేజ్ చేసే కథనానికైతే ఢోకా లేదు. కమల్ హాసన్ స్వయంగా ఓ ఫ్రెంచ్ నవలకు ఫ్లాట్ అయిపోయి.. అన్నీ తానై తన శిష్యుడి దర్శకత్వంలో ఓ సినిమా తీశాడంటే అది చాలా గొప్పగా ఉంటుందని ఆశిస్తాం. ఆ అంచనాలకు తగ్గ సినిమా అయితే ‘చీకటి రాజ్యం’ కాదు. కానీ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకుల్ని సంతృప్తి పరచడంలో మాత్రం ఈ సినిమా విఫలం కాలేదు.

సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి కానీ.. బేసిక్ ప్లాట్ లో థ్రిల్ లేకపోవడం ‘చీకటి రాజ్యం’లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్. హీరోమిషన్ ఏంటి అన్నది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈమాత్రానికేనా హీరో ఇదంతా చేశాడు.. అని నిట్టూర్చేలా ఉంటుంది అసలు వ్యవహారం. విలన్ పాత్ర విషయంలోనూ సస్పెన్స్ ఏమీ మెయింటైన్ చేయకుండా మొదట్లోనే అంతా రివీల్ చేసేశారు. దీంతో థ్రిల్ ఫ్యాక్టర్ కు అవకాశం లేకపోయింది. హీరో కొడుకుని ఎలా కాపాడుకుంటాడు అన్నదే లీడ్ పాయింట్ అయిపోయింది. ఎలాగోలా కాపాడతాడని ప్రేక్షకులకు తెలుసు కాబట్టి... ఇక ఆ మూమెంట్ కోసం ఎదురు చూడ్డమే మిగిలింది. ఐతే ఎక్కడా వేరే ఆలోచనలు రాకుండా, బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడిని రెండు గంటలు ఎంగేజ్ చేయించే కథనం ‘చీకటి రాజ్యం’కు ప్లస్ పాయింట్.

చీకటి రాజ్యం ఒక్క రాత్రిలో ముగిసిపోయే కథ. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలైతే ఇందులో 90 శాతం వరకు ఒకే నైట్ క్లబ్బులో సాగిపోతుంది. అందులో కూడా రిపీటెడ్ లొకేషన్లలో సన్నివేశాలు సాగుతాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా, మొనాటనీ లేకుండా కథనాన్ని నడిపించడం సవాలే. ఐతే కమల్ అందించిన స్క్రీన్ ప్లే కథనాన్ని బాగానే పరుగులు పెట్టిస్తుంది. రెండు గంటల్లో ఎక్కడా కూడా కథనం ఆగదు.

పాత్రల పరిచయం కోసమో.. కథ మొదలు పెట్టడం కోసమో.. ఎక్కడా కాలక్షేపం చేసే సన్నివేశాలు ఉండవు. నేరుగా తొలి సన్నివేశంలోనే కథలోకి దిగిపోయింది కమల్ టీమ్. కథలోకి ఒక్కో పాత్ర నడుచుకుంటూ వచ్చేస్తుందంతే. ఫోర్స్డ్ గా అనిపించే డ్రామా కానీ, ఎమోషన్స్ కానీ, అనవసర పాటలు, మాటలు కానీ.. ఏమీ ఉండవు. సహజంగా అనిపించే సన్నివేశాలు, పాత్రలు కథనాన్ని ఆసక్తికరంగా నడిపిస్తాయి.

నైట్ క్లబ్బులోకి ఒక్కో పాత్ర ప్రవేశించాక ఒకరి వెంట ఒకరు పడుతూ ఆడే దొంగా పోలీస్ ఆటతో గంటన్నరకు పైగా కథనం నడుస్తుంది. మధుశాలినితో ముద్దులు.. త్రిషతో ఫైటింగులు.. మధ్య మధ్యలో ప్రకాష్ రాజ్ తో చమక్కులు.. ఇలా కమల్ ప్రేక్షకుడిని బాగానే ఎంగేజ్ చేసేస్తాడు. సహజంగా అనిపించే హీరో క్యారెక్టరైజేషనే, కమల్ ఆ పాత్రను పోషించిన తీరు సినిమాకు హైలైట్. హీరోయిజం రియలిస్టిక్ గా ఉంటుంది. హీరోకు ఎదురు లేనట్లు చూపించకుండా సహజంగా ఉండేలా తీర్చిదిద్దారు. దీంతో ఆ పాత్రకు ఈజీకి కనెక్టవుతాం. మొదట్లో తండ్రీ కొడుకుల మధ్య దూరాన్ని.. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా తక్కువ సన్నివేశాల్లో చూపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ప్రి క్లైమాక్స్ - క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకుడు ‘యే దిల్ మాంగే మోర్’ అనుకుంటే తప్పేమీ లేదు. థ్రిల్లర్ మూవీస్ చివర్లో కచ్చితంగా ఏదో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ కోరుకుంటారు. బ్యాంగ్ బ్యాంగ్ క్లైమాక్స్ అయినా ఆశిస్తారు. కానీ ఇక్కడ సినిమాను మామూలుగా ముగించేశారు. విలన్ పని పట్టకుండా హీరో తన పాటికి తాను వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేం. దీనికి తోడు విలన్ పాత్ర మరీ లాజిక్ లేకుండా ప్రవర్తిస్తుంది. కేవలం సీటు బెల్ట్ పెట్టుకున్నంత మాత్రాన యాక్సిడెంట్ అయినా పర్వాలేదనుకుని డ్రైవర్ని కాల్చేయడమేంటో అర్థం కాదు. థ్రిల్లర్ మూవీస్ లో ఆశించే ‘ఎడ్జ్ ఆఫ్ ద సీట్’ మూమెంట్స్ ఏమీ లేకుండానే సినిమా ముగిసిపోతుంది.

నటీనటులు:

సహజంగా, సామాన్యుడిలా కనిపించే పాత్రల్లోనే కమల్ హాసన్ లోని గొప్ప నటుడు బయటికి వస్తాడు. దివాకర్ పాత్ర అలాంటిదే. కత్తి పోటు బాధను అనుభవిస్తూ సాగే పాత్రలో కమల్ ఎంతలా జీవించాడంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఆ దెబ్బ మెలిపెడుతున్న ఫీలింగ్ అనుభవిస్తూ ఉంటాడు. డోర్ తెరిచి లోనికి వస్తున్నపుడు ఆ డోర్ కొద్దిగా తన దెబ్బకు అలా తాకగానే నొప్పి బాధను కమల్ నటించిన తీరు చూస్తే.. ఒక పాత్రలో జీవించడమంటే ఏంటో చాటి చెబుతుంది. కొడుకుతో ఫోన్ లో ఎమోషనల్ గా మాట్లాడే ఒక్క సన్నివేశం కూడా కమల్ ప్రత్యేకతను చాటి చెబుతుంది. కమల్ తర్వాత అతడి కొడుకు పాత్రలో నటించిన కుర్రాడు అమన్ అబ్దుల్లా గురించి చెప్పాలి. చిన్న వయసులోనే గొప్పగా నటించాడతను. ప్రకాష్ రాజ్ ను ఇలాంటి ఫన్నీ విలన్ పాత్రలో చూసి చాలా కాలమైంది. భలే ఎంటర్టైన్ చేశాడాయన. త్రిష సినిమాలో మెరిసి మెరిసి మాయమవుతూ ఉంటుంది. కనిపించినంత సేపూ బాగానే చేసింది. కమల్ తో ఆమె ఫైటింగ్ సీన్ బాగుంది. అందులో త్రిష బాగా పెర్ఫామ్ చేసింది. మధుశాలినిది చిన్న పాత్రే. ఆమె నటన ఓకే. సంపత్ - కిషోర్ - యుగి సేతు కూడా తమ పాత్రల్ని బాగానే పోషించారు.

సాంకేతిక వర్గం:

కమల్ సినిమా అంటేనే ఎప్పుడూ టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. ‘చీకటి రాజ్యం’ కూడా అందుకు మినహాయింపు కాదు. జిబ్రాన్ మ్యూజిక్ సినిమాకు మేజర్ హైలైట్. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. కీలకమైన సన్నివేశాల్లో ‘చీకటి రాజ్యం’ థీమ్ మ్యూజిక్ ను అతను వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. సినిమాలో పాటలేమీ లేవు. ఎండ్ టైటిల్స్ లో కమల్ పాడిన థీమ్ సాంగ్ వస్తుంది. అది బాగుంది. సాను జోస్ వర్గీస్ ఛాయాగ్రహణం కూడా సూపర్బ్. రిపీటెడ్ లొకేషన్లలోనే మొనాటనీ రాకుండా సన్నివేశాల్ని చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. కిచెన్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా వర్క్ స్టన్నింగ్ గా అనిపిస్తుంది. మిగతా సాంకేతిక విభాగాలు కూడా బాగా పని చేశాయి. అబ్బూరి రవి కమల్ సినిమాల శైలికి తగ్గట్లే సన్నివేశాలకు అవసరమైన మేరకు సహజమైన మాటలు రాశాడు. డైలాగ్స్ దాదాపుగా తమిళ వెర్షన్ నుంచి తీసుకున్నట్లే ఉన్నాయి. దర్శకుడిగా కమల్ నుంచి రాజేష్ సెల్వ ఎంత ఫ్రీడమ్ తీసుకున్నాడో కానీ.. దర్శకత్వ పరంగా కంప్లైంట్స్ లేవు. కాకపోతే స్క్రిప్టే మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుకోవాల్సింది.

చివరగా: థ్రిల్ తక్కువే కానీ.. ఎంగేజ్ చేస్తుంది

రేటింగ్- 3/5


#Cheekatirajyam, #CheekatiRajyammovie, #KamalhaasanCheekatirajyam, #CheekatiRajyamRating, #Cheekatirajyamtalk

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News