టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానముంది. ఎలాంటి సినీ రాజకీయ నేపథ్యం లేని అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి... సినిమా ఇండస్ట్రీలో తన స్వశక్తి ఎదిగిన తీరు, చిత్రరంగంలో ఒక్క నటనతోనే సరిపెట్టుకోకుండా... ఇతర విభాగాలపైనా పట్టు సాధిస్తూ... సొంత చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని తన కుటుంబానికి చెందిన వారిని ఒక్కొక్కరినే పైకి తెస్తూ చిరు వేసిన అడుగులు నిజంగానే ఆసక్తికరమనే చెప్పాలి. ఇదేదో ఒక్క రోజులోనే, ఏడాదిలోనే జరిగిపోలేదు కూడా. టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి ఇప్పుడు స్థానం... చిరు కొన్నేళ్లుగా పట్టుదలతోనే కాకుండా క్రమశిక్షణతో సాగించిన ప్రయాణ ఫలితమేనని చెప్పాలి. ఈ క్రమంలో చిరుకు చాలా మంది మిత్రులుగానే ఉంటే... కొందరు శత్రువులు కూడా ఉన్నారన్నది జగమెరిగిన సత్యమే.
అయితే ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అన్న విషయాన్ని పక్కనపెడితే... అప్పుడెప్పుడో రాజశేఖర్, జీవితల కారుపై మెగా అభిమానులు దాడి చేయడం పెను కలకలమే రేగింది. ఆ ఘటనతో చిరు - రాజశేఖర్ ల మధ్య విభేదాలున్నాయన్న మాట కూడా వినిపించింది. చాలా కాలం పాటు ఆ విభేదాలు అలాగే ఉన్నా... ఆ విషయాన్ని జనం ఎప్పుడో మరిచిపోయారు కూడా. అయితే ఇటీవలి తన తాజా చిత్రం *గరుడవేగ* చిత్రం రిలీజ్ తర్వాత రాజశేఖర్ తన భార్య జీవితను వెంటబెట్టుకుని చిరు ఇంటిలో ప్రత్యక్షమైపోయారు. ఇద్దరూ చాలాసేపే మాట్లాడుకున్నారు. రాజశేఖర్ చిత్రంపై మెగాస్టార్ ప్రశంసలు కూడా కురిపించారు. దీంతో నాడు వారిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు మరోమారు జనానికి గుర్తుకు వచ్చాయి. అయితే నాటి విభేదాలు జనం అనుకుంటున్నట్లుగా ఎంతోకాలం సాగలేదని, తమపై దాడి జరిగిన కొన్నాళ్లకే తమ మధ్య ఉన్న విభేదాలు సమసిపోయాయని రాజశేఖర్ చెబుతున్నారు. ఈ విభేదాలు ఎలా సమసిపోయాయన్న విషయాన్ని కూడా ఆయన కాస్తంత వివరంగానే చెప్పుకొచ్చారు.
రాజశేఖర్ ఈ విషయంపై ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘చిరు గారితో నాకు విభేదాలు వచ్చాక కొన్నేళ్లు దూరంగా ఉండిపోయాను. కానీ ఆ తర్వాత అప్పుడప్పడూ కలుస్తూనే ఉన్నాం. ‘మేముసైతం’తో పాటు వేరే ఫంక్షన్లలో కలిశాం. అప్పుడు హాయ్ అంటే హాయ్ అనుకున్నాం అంతే. ఐతే ఒకసారి మా అమ్మాయి శివాని మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీలో అప్లై చేశాం. ఆ విషయంలో సపోర్ట్ కోసం జీవిత.. చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్లగానే చిరంజీవి గారు నా గురించి అడిగారట. దీంతో జీవిత వెంటనే నాకు కాల్ చేసి రమ్మని చెప్పింది. కానీ నేను రెడీ అయి లేను. దీంతో ఆమె వెనక్కి వచ్చి నన్ను తీసుకెళ్లింది. చిరంజీవి గారు అప్పుడు బాగా మాట్లాడారు. మాకు అవసరమైన సాయం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం బాగా కలిసిపోయాం. ‘గరుడవేగ’ విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేశారు’’ అని రాజశేఖర్ తెలిపాడు.