ట్రెండీ టాక్: వ‌కీల్ సాబ్ కి జ్ఞానోద‌యం

Update: 2020-04-15 04:00 GMT
ఊహించ‌ని పిడుగులా విరుచుకుప‌డింది క‌రోనా. ఒకేసారి ప‌ది సునామీలు విరుచుకుప‌డినా జ‌ర‌గ‌నంత న‌ష్టం జ‌రిగిపోయింది. ప్ర‌పంచ మార్కెట్ల అల్ల క‌ల్లోలం ఎవ‌రూ ఊహించ‌నిది. ఈ ప‌రిస్థితి నుంచి కోలుకునేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. కొవిడ్ 19 మ‌హ‌మ్మారీకి ఇన్సులేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటుందా? అంటే ఏమో అనేస్తున్నారు.

ఈ ప్ర‌భావం సినీపరిశ్ర‌మ‌ల‌పైనా తీవ్రంగా పడింది. ఇప్ప‌టికే సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా చిత్రాలు స‌హా మిడ్ రేంజ్ సినిమాల‌పైనా ప‌డింది. ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేదెలా? అన్న‌దే నిర్మాత‌ల టాస్క్. ఇప్ప‌టికే స‌గం చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకున్న వాళ్లంతా ఎలాగైనా కాస్ట్ క‌టింగ్ తో కొంత‌వ‌ర‌కూ న‌ష్టాల్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ విష‌యంలో దిల్ రాజు చాలానే క‌ల‌త‌గా ఉన్నార‌ని తెలుస్తోంది.

సంద‌ర్భానుసారం ప‌క‌డ్భంధీగా ప్లాన్ చేయ‌డంలో రాజా వారి త‌ర్వాత‌నే. వాస్త‌వానికి వ‌కీల్ సాబ్ ని ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని భావించారు. అందుకే అత్యంత వేగంగా సినిమాని పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ వేశారు. ప‌వ‌న్ 30 రోజుల కాల్షీట్లు ఇచ్చి ఎంతో సిన్సియ‌ర్ గా సెట్స్ కొచ్చి త‌న ప‌ని తాను చేసుకుపోయారు. నెల‌రోజుల కోసం ఏకంగా 50 కోట్ల పారితోషికం చెల్లించేందుకు దిల్ రాజు అంగీకారం కుదుర్చుకున్నార‌ని ఇంత‌కు ముందే వెల్ల‌డించాం. ఇక ఒరిజిన‌ల్ వెర్షన్ పింక్ తో పోలిస్తే తెలుగులో వ‌కీల్ సాబ్ ని పూర్తి స్థాయిలో క‌మ‌ర్షియ‌లైజ్ చేయాల‌ని భావించారు.

ప‌వ‌న్ స‌ర‌స‌న ఒక క‌థానాయిక‌ను ఎంపిక చేసి స్పెష‌ల్ రొమాంటిక్ ట్రాక్ ని యాడ్ చేయాల‌నుకున్నారు. అయితే ఉన్న‌ట్టుండి ఊహించ‌ని పిడుగులా విరుచుకుప‌డిన క‌రోనా మ‌హమ్మారీ దెబ్బ‌కు ప్లాన్ అంతా రివ‌ర్స్ అయిపోయింది. షెడ్యూల్స్ పెండింగులో ప‌డిపోయాయ్. ఈ గ‌డ‌బిడ గంద‌ర‌గోళం ఇప్ప‌ట్లో తేలేట్టు లేదు. ఇదింకా ఎన్నాళ్లు కొన‌సాగుతుందో తేల‌ని ప‌రిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ఎక్స్ ట్రాగా పెట్టాల‌నుకున్న ఆ ల‌వ్ ట్రాక్ ని ఎత్తేశార‌ట‌. ల‌వ్ ట్రాక్ పేరుతో హీరోయిన్ పారితోషికం.. అద‌న‌పు ఖర్చు  ఎందుకు? అనుకున్నార‌ని తెలుస్తోంది. ఏదైతేనేం.. కొవిడ్ 19 ప్ర‌భావం వ‌కీల్ సాబ్ పై ఆ రేంజులోనే ప‌డింది మ‌రి. ప‌వ‌న్ - ఆదిత్య శ్రీ‌రామ్ బృందంతో చ‌ర్చించే నిర్మాత ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అయితే మ‌హమ్మారీ క‌ల్లోలం.. ఈ రేంజులో ఉంటుందా? అంటే.. ఇది సాక్షాత్తూ ఆ ప‌ర‌మేశ్వ‌రుని అనుగ్ర‌హం పొందిన‌ బ్ర‌హ్మ అయినా ఊహించ‌ని విప‌త్తు అని చెబితే అతిశ‌యోక్తి కాదేమో! కాల‌జ్ఞానంలో వీర‌బ్రహ్మేంద్ర స్వామి సైతం ఊహించి ఉండ‌డు సుమీ!

Tags:    

Similar News