RRR సినిమాలో జక్కన్న వాటా అన్ని కోట్లా..?

Update: 2022-03-29 17:30 GMT
'బాహుబలి' తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో ''ఆర్.ఆర్.ఆర్'' పై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి. దీనికి ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు పెద్ద స్టార్లు కూడా జత కలవడంతో క్రేజ్ మరో స్థాయికి చేరింది. అందుకే నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 450 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన ఈ మల్టీస్టారర్ట్.. దానికి రెండింతల ప్రీ రిలీజ్ చేసిందని తెలుస్తోంది.

RRR సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి మరియు ప్రొడ్యూసర్ దానయ్య మధ్య కుదిరిన ముందస్తు ఒప్పందం ప్రకారం.. ఇద్దరూ హిందీ థియేట్రికల్ & నాన్ థియేట్రికల్ మార్కెట్ నుండి పొందబోయే ప్రతి పైసాను పంచుకోవాల్సి ఉందట. ఈ లెక్కన ఇప్పుడు జక్కన్న ఈ సినిమా ద్వారా 150 కోట్ల మొత్తాన్ని పొందే అవకాశం ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' మూవీ RRR హిందీ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దాదాపు 220 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. ఇక నార్త్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. ఐదు రోజుల్లో 100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో సెన్సేషనల్ ఫిగర్ గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే RRR విడుదలకు ముందు సినిమాపై బజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలుదారుల్లో ఓ మూలన భయం ఉండింది. పెట్టిన మొత్తాన్ని వెనక్కి రాబట్టలేమేమో అనే సందేహాలు ఉన్నాయి. అందుకే రిలీజ్ కు కొన్ని రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నిర్మాత దానయ్యను కలుసుకుని ముందు మాట్లాడుకున్న దాంట్లో రాయితీ ఇవ్వాలని కోరారట.

అయితే RRR రిలీజ్ కు ముందు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టిక్కెట్ ధరలు పెంచుతూ జీవోలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పంపిణీదారులు డిమాండ్ చేసిన రాయితీని ఇవ్వడానికి దానయ్య వెనకాడారట. అయితే కనీసం జీఎస్టీని అయినా భరించాలని వారు పట్టుబట్టారట.

గత శుక్రవారం RRR సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. నాలుగు రోజుల్లో 562.96 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇప్పుడు దానయ్య జీఎస్టీని తమకు చెల్లించాలన్న డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ కు ఎట్టకేలకు అంగీకరించారట. రైట్స్ కొనుగోలు చేసిన వారందరికీ ఇప్పుడు 18 శాతం జీఎస్టీ తిరిగి చెల్లించేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది.

కాగా, 'RRR' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు.
Tags:    

Similar News