కన్ఫమ్.. జేమ్స్ బాండ్ మారిపోతున్నాడు

Update: 2016-02-16 19:30 GMT
హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. నాలుగు దశాబ్దాలకు పైగా జేమ్స్ బాండ్ సిరీస్ ప్రపంచ సినీ ప్రియుల్ని అలరిస్తోంది. ఒక సిరీస్ ఇన్నేళ్లు కొనసాగడమన్నది ప్రపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ చిత్రాలకే చెల్లింది. ప్రేక్షకులకు కొంచెం మొహం మొత్తినపుడల్లా.. జేమ్స్ బాండ్ పాత్రధారిని మార్చేసి, ఓ సరికొత్త కథాంశంతో కొత్త చిత్రాన్ని అందిస్తుంటారు బాండ్ సిరీస్ రూపకర్తలు. అలా దశాబ్దం కిందట పియర్స్ బ్రాస్నన్ స్థానంలోకి వచ్చాడు నీలి కళ్ల డేనియల్ క్రెయిగ్. బాండ్ సిరీస్ లో తన తొలి సినిమా అయిన ‘క్యాసినో రాయల్’తోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు క్రెయిగ్.

ముందు ఇతను బాండ్ పాత్రకు సరిపోతాడా అని సందేహించిన వాళ్లు కూడా బెస్ట్ బాండ్స్ జాబితాలో ఇతడికి కచ్చితంగా స్థానం దక్కుతుందని నిర్ణయించారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఐతే బాండ్ సిరీస్ లో లేటెస్ట్ మూవీ - క్రెయిగ్ కు నాలుగో చిత్రం అయిన ‘స్పెక్టర్’ మాత్రం సరిగా ఆడలేదు. ఈ సినిమా ప్రమోషన్ల టైంలోనే తనకిక బాండ్ గా నటించడం ఇష్టం లేదన్న సంగతి వెల్లడించాడు క్రెయిగ్. దీనిపై బాండ్ సిరీస్ రూపకర్తలు కూడా ఏమీ మాట్లాడలేదు. తాజాగా క్రెయిగ్.. ‘ప్యూరిటీ’ అనే అమెరికన్ టీవీ సిరీస్ లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతనిందులో దిగాడంటే బాండ్ సినిమాకు సమయం కేటాయించడం చాలా కష్టం. కాబట్టి క్రెయిగ్ ఇక బాండ్ సినిమాలకు దూరమైనట్లే భావించాలి. కాబట్టి తర్వాతి బాండ్ సినిమాలో మనం కొత్త హీరోను చూడబోతున్నామన్నమాట.
Tags:    

Similar News