ట్రైలర్ 1.0: మాస్ కా దాస్ డబుల్ యాక్షన్.. డబుల్ 'ధమ్కీ'..!

Update: 2022-11-18 15:24 GMT
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "దాస్ కా ధమ్కీ". ఇది విశ్వక్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ట్రైలర్ ని ఆవిష్కరించారు.

"ధమ్కీ" ట్రైలర్ 1.0 ని నటసింహం నందమూరి బాలకృష్ణ లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వక్ సేన్ డబుల్ రోల్ లో కనిపించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఒకరు వెయిటర్ గా కనిపిస్తే.. మరొకరు సంపన్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా కనిపించారు.

కొన్ని కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని కలిగిన వ్యక్తి ఓ ప్రమాదంలో మరణించగా.. కుటుంబ పెద్ద యొక్క అభ్యర్థనపై ఒక వెయిటర్ అతని స్థానంలోకి వస్తాడు. కంపెనీకి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి.. కుటుంబంలో చిరునవ్వులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను కొందరు శతృవులను ఫేస్ చేయాల్సి వచ్చింది.

విశ్వక్ సేన్ ఇందులో డబుల్ యాక్షన్ లో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల కోసం రెండు విభిన్న క్యారెక్టరైజేషన్లను రాసుకోవడమే కాదు.. వాటి మధ్య తేడా కనిపించేలా చూసుకున్నాడు. వెయిటర్ అయిన విశ్వక్ సేన్ డబ్బున్న వాడిగా నటించి నివేదా పేతురాజ్ ను ప్రేమలో పడేసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య వచ్చే అంశాలు యూత్ ని ఆకట్టుకుంటాయి.

ట్రైలర్ ని బట్టి చూస్తే స్టోరీ లైన్ రోటీన్ గానే వుంది. కాకపొతే సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇందులో ఏదో ట్విస్ట్ వుంటుందనిపించేలా ట్రైలర్ ను కట్ చేశారు. రావు రమేశ్ - రోహిణి - అజయ్ - హైపర్ ఆది - మహేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తరుణ్ భాస్కర్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించారు.

ఇందులో విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ గా నిలిచాయి. బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ధమ్కీ" సినిమాని 2023 ఫిబ్రవరిలో తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View
Tags:    

Similar News