డిసెంబ‌ర్ 17 .. చిరు వ‌ర్సెస్ బాల‌య్య వార్..?

Update: 2021-10-26 06:02 GMT
టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాల రిలీజ్ తేదీల‌పై స‌రైన క్లారిటీ దొర‌క‌డం లేదు. జ‌న‌వ‌రిలో ఇద్ద‌రు స్టార్ హీరోల  పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కు ఉండ‌టంతో సంక్రాంతి సీజ‌న్ ని మ‌రికొంత మంది బిగ్ స్టార్స్ మిస్ అవ్వాల్సి వ‌స్తోంది. ఆ త‌ర్వాత రిలీజ్ చేద్దామ‌నే ధీమా ఉన్నా?  క్లారిటీ   లోపిస్తుంది. ఈనేప‌థ్యంలో మ‌రోసారి ఆ చిత్రాలు జ‌న‌వ‌రి కంటే ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `అఖండ` చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు.

మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `ఆచార్య` కూడా షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంత‌ర ప‌నుల్లోనే నిమ‌గ్న‌మైంది. ముందుగా ఈచిత్రం జ‌న‌వ‌రిలో రిలీజ్ అనుకున్నారు. కానీ పాన్ ఇండియా చిత్రాలు ఉండ‌టంతో వెన‌క్కి త‌గ్గింది. అటుపై ఫ్రిబ‌వ‌రిలో రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. కానీ అది కూడా ఖ‌రారు కాలేదు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి..బాల‌య్య డిసెంబ‌ర్ 17 వ‌తేదీని లాక్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. అయితే ఆ తేదీని ఇప్ప‌టికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `పుష్ప` ది న‌రైజింగ్` ని ఆ తేదీలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇది పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ అవుతున్న చిత్రం. అయ‌తే ఇక్క‌డే పుష్ప మ‌రోసారి గంద‌ర‌గోళంలో ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. కేవ‌లం ఇండియాలోనే 200కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంతో బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. అంటే అన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ను అన్ కండీష‌న్ల‌గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం కొన్ని చోట్ల కోవిడ్ నిబంధ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 17నాటికి ఆ ప‌రిస్థితులు తొల‌గిపోతాయా? అన్న‌దే సందేహం. అలా కాకుండా పుష్ప రిలీజ్ కు వస్తే ప్ర‌తికూల ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో పుష్ప రిలీజ్ వాయిదా ప‌డితే గ‌నుక  చిరు..బాల‌య్య లు ముందుకు వ‌చ్చేయ‌డం ప‌క్కా అని స‌మాచారం.
Tags:    

Similar News